చిరు.. పాత స్నేహాలు.. కొత్త కొత్తగా.!

హీరో శ్రీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు. రవితేజ, శ్రీకాంత్‌, రాజా రవీంద్ర, ఇంకా చాలామంది ఎప్పుడూ చిరంజీవి వెన్నంటే కన్పించేవారు. 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమా టైమ్‌లో చిరంజీవితో తేడాలొచ్చి, మెగా క్యాంప్‌కి దూరమయ్యాడు రవితేజ. చిరంజీవి రాజకీయాల్లోకొచ్చిన తర్వాత, ఆయనకు కాస్త దూరమయ్యాడు శ్రీకాంత్‌. అలా చిరంజీవికి దూరమైన సినీ ప్రముఖులెందరో వున్నారు. 

ప్రధానంగా చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత, అంతకుముందు ఆయనతో వున్నవారిలో చాలామంది ఆయనకు మొహం చాటేసిన విషయం విదితమే. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి సినిమాల్లోకొచ్చారు. వస్తూనే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో బంపర్‌ హిట్‌ అందుకున్నారు. ఇంకేముంది, మళ్ళీ పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. చిరంజీవి - శ్రీకాంత్‌ తాజా కలయిక కూడా అలాంటిదేననుకోవాలేమో.! 

అసలు విషయానికొస్తే, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'రారా' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదలయ్యింది. శ్రీకాంత్‌కి ఈ సినిమా మంచి విజయాన్నివ్వాలని ఫస్ట్‌ లుక్‌ విడుదల సందర్బంగా చిరంజీవి ఆకాంక్షించారు. ఈ సినిమాలో నజియా, సీతానారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ఎం.విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తమ్మీద, సినీ పరిశ్రమలో పాత స్నేహాలు మళ్ళీ కొత్తకొత్తగా చిరంజీవి చుట్టూ చిగురిస్తున్నాయనుకోవాలేమో.!

Show comments