వైఎస్సార్సీపీ 'స్పెషల్‌' టార్గెట్‌ టీడీపీనే.!

కాంగ్రెస్‌ తనదైన గేమ్‌ ప్లాన్‌తో దూసుకుపోతోంది.. రాజ్యసభలో ఇప్పటికే ప్రైవేటు మెంబర్‌ బిల్లుని పొలిటికల్‌గా క్యాష్‌ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇంతకన్నా మించిన అవకాశం ఇంకోటి దక్కదన్నది కాంగ్రెస్‌ వ్యూహం. ఆ వ్యూహంతోనే కాంగ్రెస్‌, చాలా సింపుల్‌ బిల్లుని, చాలా ప్రాధాన్యత కలిగిన బిల్లుగా మార్చేసింది. క్యాబినెట్‌ నిర్ణయంతో రావాల్సిన ప్రత్యేక హోదాని, పార్లమెంటులో చట్టం ద్వారా రప్పించాలని, తద్వారా బీజేపీని 'కార్నర్‌'లోకి నెట్టేయాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. 

మరోపక్క, తెలుగుదేశం పార్టీని కార్నర్‌ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ఛాన్స్‌ని కాంగ్రెస్‌ తీసుకోగా, లోక్‌సభలో ఆ ఛాన్స్‌ తామే తీసుకుంటామని చెబుతోంది వైఎస్సార్సీపీ. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఆ ఛాన్స్‌ని వైఎస్సార్సీపీకి ఇస్తుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

ఒకవేళ రాజ్యసభలో గనుక కేవీపీ ప్రైవేటు బిల్లు పాస్‌ అయితే, అప్పుడిక బీజేపీతోపాటు, తెలుగుదేశం పార్టీ కూడా కార్నర్‌లోకి వెళ్ళిపోతాయి. లోక్‌సభలో ప్రైవేటు బిల్లు పెట్టే విషయంలో కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ మధ్య ఆధిపత్య పోరు షురూ అవుతుంది. అదే సమయంలో, ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టి, తద్వారా టీడీపీని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహాన్ని ఇప్పటికే అటు కాంగ్రెస్‌, ఇటు వైఎస్సార్సీపీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

వైఎస్‌ జగన్‌, ఇప్పటికే ఈ విషయమై పార్టీ నేతలతో చర్చించి ఓ వ్యూహాన్ని ఖరారు చేశారట. ఢిల్లీలో స్వయంగా తానే ఆందోళనల్లో పాల్గొనాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారట. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో ఓటింగ్‌ జరుగుతుందా.? ఓటింగ్‌ జరిగితే, తదనంతర పరిణామాలు ఎలా వుంటాయన్నదానిపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించి, జగన్‌ ఢిల్లీ టూర్‌ని ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం. 

అదే సమయంలో, రేపో మాపో ఢిల్లీకి వెళ్ళే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సమాయత్తమవుతున్నారు. మొత్తమ్మీద, ఉఫ్‌మని ఊదేస్తే ఎగిరిపోయే బిల్లు.. అనుకున్న కేవీపీ బిల్లు, కాస్తంత దృఢంగానే మారినట్లు తెలుస్తోంది. ఈ రకంగా కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పగల నాయకుడిగా మరోమారు తన ఉనికిని చాటుకుంటున్నారన్నమాట. అంతా ఆయనకు అలా కలిసొచ్చేస్తోందంతే.

Show comments