పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కన్పిస్తుందట. ఆ విషయం పక్కన పెడితే, తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ని 'మూఢ నమ్మకాల రాష్ట్రం'గా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకుపోతోంది. ఈ క్రమంలో 'మంచి ముహూర్తం' చూసుకోవడాన్ని తప్పు పట్టలేం. ఇస్రో ఏ విజయాలు సాధించినా, దానికి ముందు పూజలు చేయడం అనేది ఓ 'ప్రక్రియ'గా మాత్రమే చూడాలి. అదో నమ్మకం అంతే.
ఇక, అసలు విషయానికి వస్తే అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి వివిధ శాఖలు తరలి వెళ్ళేందుకు ఇంకా సరైన ముహూర్తం దొరకడంలేదట. ఇప్పటికే కొన్ని శాఖల్ని తరలించేశారు లాంఛనంగా. శంకుస్థాపనకు ముహూర్తం, ప్రారంభోత్సవానికి ఓ ముహూర్తం.. ఇవన్నీ అయిపోయాయి. చంద్రబాబు గతంలోనే ప్రారంభించేశారు తాత్కాలిక సచివాలయాన్ని. మళ్ళీ ఈ మధ్యనే ఓ సారి ఉద్యోగులతో కలిసి మంత్రులూ సచివాలయాన్ని ప్రారంభించేయడం చూశాం.
ఏమయ్యిందో, కొత్తగా ముహూర్తాల కోసం కొన్ని శాఖల తరలింపు వాయిదా పడిందట. ఏదన్నా కుక్కని చంపేయాలంటే, అది పిచ్చిది.. అన్న ముద్ర వేసెయ్యాలట. అలాగే వుందిప్పుడు, టీడీపీ హయాంలో పరిస్థితి. అక్కడేమో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పూర్తవలేదు. కానీ, కాంట్రాక్టర్లకు అదనంగా అప్పగింతలు చేయక తప్పదు. అదీ అసలు కారణం. ప్రారంభమైపోయిందని అన్పించేసి, ముహూర్తాల పేరుతో.. నిర్మాణ సంస్థలకు అదనపు సమయాన్ని, అదనంగా వ్యయాన్నీ ముట్టజెప్పడం ఈ మొత్తం ప్రక్రియలో భాగం.
ముఖ్యమంత్రి ఓ సారి ముహూర్తం చూసుకుని సచివాలయాన్ని ప్రారంభించేశాక, అందులోకి ఆయా శాఖలు వెళుతున్న ప్రతిసారీ ముహూర్తాలు చూసుకోవడమేంటి కామెడీ కాకపోతే.! శాఖల వారీగా ఇప్పుడు ముహూర్తాలు చూసుకుంటే, ముందు ముందు ఉద్యోగుల వారీగా ముహూర్తాలు చూసుకుని కార్యాలయాల్లో అడుగు పెడ్తారేమో. ఆ తర్వాత ముహూర్తం చూసుకుని, అక్కడ పనులు మొదలవుతాయేమో. చివరికి పనుల కోసం వెళ్ళాల్సిన సామాన్యులు కూడా ఈ పచ్చ పండితుల దగ్గరే ముహూర్తాలు పెట్టించుకోవాలేమో. హైటెక్ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు, రాష్ట్రాన్నీ.. వ్యవస్థల్నీ ఇలా భ్రష్టు పట్టించేయడమేంటి.?
'పనులు పూర్తవలేదు..' అని చెప్పుకోలేని భావదారిద్య్రం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి కాక, ఇంకెవరికన్నా చెల్లిందా.! ఈ లెక్కన చంద్రబాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనీ డౌట్స్.!