యాదాద్రి 'హనుమాన్‌' మేడిన్‌ చైనా....!

'శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు'...మన భారతీయ శిల్పుల ప్రతిభను, నైపుణ్యాన్ని కళ్లకు కట్టే పాట ఇది. ఒకప్పుడు సృష్టికే అందాలు తెచ్చిన మన శిల్పులు ఇప్పుడు అంతరించిపోయారా? అద్భుతమైన శిల్పాలు చెక్కేవారు కరువైపోయారా? మన దేవతా మూర్తులను మనం రూపొందించుకోలేని దుస్థితిలో ఉన్నామా? దేశం గొడ్డుబోయిందా? ...ఈ ప్రశ్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్న సమాధానం 'అవును' అని. ఈ విషయం ఆయన నేరుగానో, పబ్లిగ్గానో చెప్పలేదు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 

యాదాద్రిని (యాదగిరి గుట్ట)  తిరుమల మాదిరిగా చేయాలని, అంతటి ప్రాశస్త్యం కల్పించాలని, దానికి అంతర్జాతీయంగా ఆధ్యాత్మికపరమైన ఇమేజ్‌ తీసుకురావాలని అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేసీఆర్‌ తాపత్రయపడుతున్నారు. మంచిదే. ఎవ్వరూ కాదనడంలేదు. ప్రజాసమస్యల పరిష్కారానికి  చూపనంతటి శ్రద్ధ యాదాద్రి అభివృద్ధి మీద చూపిస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్లాన్‌లన్నీ తానే స్వయంగా తయారుచేయిస్తున్నారు. ఆయనకు ఇష్టమైన, విశ్వాసమున్న చినజీయర్‌ స్వామి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆ దిశగా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. 

ఆలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తే ప్రజలు సంతోషిస్తారని కేసీఆర్‌కు తెలుసు. తిరుమలవంటి ఆలయం తెలంగాణలో ఉందంటే అది కేసీఆర్‌ పుణ్యమేనని ప్రజలు తరతరాలకు చెప్పుకుంటారు. మతపరమైన, ఆధ్యాత్మికపరమైన సెంటిమెంట్లను నిరంతరం కాపాడుతుంటే రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందులో భాగమే ప్రభుత్వపరంగా పుష్కరాలు, బోనాలు, బతుకమ్మలు వగైరాలు నిర్వహించడం. సరే...అసలు విషయానికొస్తే యాదాద్రిని అత్యంత ఆకర్షణీయంగా తయారుచేయడంలో భాగంగా బ్రహ్మాండమైన అంటే అత్యంత ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పాలని కేసీఆర్‌ సంకల్పించారు. 

పేరుమోసిన పుణ్యక్షేత్రాల్లో, ఆలయాల్లో ఏదో ఒక దేవతా మూర్తి భారీ విగ్రహం కనబడుతూ ఉంటుంది. యాదాద్రిలో భారీ హనుమంతుడి విగ్రహం నెలకొల్పడం భక్తులకు సంతోషకరమైన వార్తే. 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయుడి విగ్రహం నెలకొల్పాలని కేసీఆర్‌ నిర్ణయించి నమూనా తయారుచేయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇంత భారీ విగ్రహాన్ని తయారుచేసే శిల్పులు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశంలోనే లేరనుకున్నారేమో. చైనా శిల్పుల చేత తయారుచేయించాలని నిర్ణయించారు.  విగ్రహం తయారీపై చైనా శిల్పులతో సంప్రదింపులు జరిపేందుకు ఒక బృందాన్ని అక్కడికి పంపుతున్నారు. 

చైనా కార్పొరేట్‌ సంస్థలు ఆంజనేయస్వామి విగ్రహం తయారుచేస్తుండటంపై కేసీఆర్‌ మురిసిపోతున్నారు. వాళ్లకు ఎన్ని కోట్లు ధారాదత్తం చేస్తున్నారో తెలియదు.  విగ్రహం తయారుచేయడానికి ఏ దేశపు శిల్పులైతేనేం? వాళ్లు మాత్రం కళాకారులు కాదా? అని కొందరడగొచ్చు. కరెక్టే. కాని మన దేవుడిని తయారుచేసే శిల్పులు మన దేశంలో కరువయ్యారా? ప్రపంచ ప్రఖ్యాత ఆలయాలు నిర్మించిన, అద్భుతమైన, అపురూపమైన శిల్ప సంపదను సృష్టించిన దేశంలో  హనుమాన్‌ విగ్రహం తయారుచేయలేరా? తెలంగాణలోనూ వేయి స్తంభాల గుడి, రామప్ప వంటి గొప్ప ఆలయాలను ఏ విదేశీయులు నిర్మించారు? దేశంలోని చాలా ఆలయాల నిర్మాణ కౌశలం చూసి విదేశీ ఆర్కిటెక్టులు ఇప్పుటికీ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఇంజనీరింగ్‌ వారికి అంతుబట్టడంలేదు. 

రాచరిక వ్యవస్థ అంతరించి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఎన్నో గొప్ప ఆలయాలు, విగ్రహాలు నిర్మించారు. గొప్ప శిల్పులు ఇప్పటికీ ఉన్నారు.   దేశంలోనే ఇంత ప్రతిభ ఉన్నప్పుడు వారికి అవకాశం ఇవ్వకుండా హనుమాన్‌ విగ్రహ తయారీని నాస్తిక దేశమైన చైనాకు అప్పగించడమేమిటి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విదేశీ మోజు విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ల దృష్టిలో మనోళ్లు ఎందుకూ పనికిరారు. ఆ మోజుతోనే కేసీఆర్‌ దేవుడిని కూడా చైనావారికి అప్పగించారు. విగ్రహం తయారీకి సంబంధించి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ మార్గంలో నడిచారు. 

గుజరాత్‌లో తొలి భారత హోమ్‌ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని (182 మీటర్లు) 'స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ' పేరుతో నెలకొల్పాలని మోదీ సంకల్పించారు. దీన్ని తయారుచేస్తున్నది చైనావారే. ప్రస్తుతం పని జరుగుతోంది. హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన బిర్లా మందిర్‌, సంఘీ టెంపుల్‌ ఉన్నాయి. రెండు ఆలయాల్లో ఉన్నది వెంకటేశ్వరస్వామి. కాని బిర్లా, సంఘీలే దేవుళ్లయిపోయారు. అలాగే యాదాద్రి ఆంజనేయస్వామిని కూడా 'చైనా హనుమాన్‌' అని వ్యవహరిస్తారేమో....!

-నాగ్‌ మేడేపల్లి

Show comments