‘ఖైదీ’ కి చిరంజీవి పొందిన పారితోషకం ఎంతంటే..!

‘ఖైదీ’ చిరంజీవి కెరీర్ లో మేలి మలుపు. టాలీవుడ్ లో సరికొత్త యాంగ్రీయంగ్ మ్యాన్ గా చిరంజీవి అవతరించాడీ సినిమాతో. అప్పటికే చిరు ఖాతాలో కొన్ని హిట్లు ఉన్నా.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖైదీ ఆయనను మాస్ హీరోగా నిలబెట్టింది. కెరీర్ ను పరుగులెత్తించింది. చిరంజీవి కెరీర్ కే గాక.. తెలుగు చలన చిత్ర చరిత్రలో కూడా ఖైదీ సినిమా ప్రత్యేకమైనదే! వసూళ్ల విషయంలో కూడా కొత్త రికార్డులను సృష్టించిన సినిమా ఇది. మరి ఈ సినిమాకు గానూ చిరంజీవి పొందిన పారితోషకం ఎంత? అనే విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు దర్శకులు కోదండరామిరెడ్డి.

ఈ సంచలన సినిమాకు దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి బంధువులే ఈ సినిమాకు నిర్మాతలు. సంయుక్తా ఆర్ట్స్ బ్యానర్ మీద రూపొందించిన ఈ సినిమాకు తిరుపతి రెడ్డి నిర్మాత. తామంతా ఒక పెళ్లిలో కలిశామని.. తిరుపతిరెడ్డి వాళ్లు అప్పటికే దర్శకుడైన తనతో ఉత్సాహంగా సినిమా ప్రతిపాదన తెచ్చారని రెడ్డి పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలని కాదు.. ఒక మంచి సినిమా తీయాలి, ఖర్చుకు ఏ మాత్రం వెనుకడవద్దు.. అంటూ వారు ఉత్సాహభరితంగా ముందుకు వచ్చారని, నటీనటుల పారితోషకం విషయంలో కూడా ప్రత్యేకంగా లెక్కలేమీ వేయకుండా.. అందరికీ మంచి రెమ్యూనరేషన ఇచ్చారని ఈ వెటరన్ దర్శకులు వివరించారు.

1983లో విడుదలైన ఈ సినిమాకు చిరంజీవి గరిష్టంగా 1.75లక్షల రూపాయల పారితోషకాన్ని పొందారట! అప్పటికే అది చాలా ఎక్కువ మొత్తం అని వేరే చెప్పనక్కర్లేదు. అలాగే సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ చిరంజీవి తిరగడానికి ఒక ఫారిన్ కారును కూడా తెప్పించారట నిర్మాతలు. బాగా ధనికులు కావడంతో తిరుపతిరెడ్డి వాళ్లు ఎక్కడా రాజీ పడలేదు అని.. తారాగణాన్ని అంతా బాగా చూసుకున్నారని కోదండరామిరెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాత విషయాలన్నింటిని చెప్పారు.

హీరోయిన్లు మాధవి, సుమలతలు కూడా ఈ సినిమాకు ఒక్కొక్కరు రూ.50 వేల రూపాయల వరకూ పారితోషకంగా పొందారని ఆయన వివరించారు. ఇంత విరివిగా ఖర్చు చేసినా.. బడ్జెట్ పరిమితులేవీ పెట్టుకోకపోయినా.. ఖైదీతో నిర్మాతలు భారీగా లాభాలు ఆర్జించారని ఆయన పాత లెక్కలు చెప్పారు.

Show comments