మహిళా జైలుకు తరలిస్తే మంత్రులు మాయమవుతారా?

'మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె' అన్నట్లుగా అక్రమాస్తుల కేసులో దోషి అయిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు జైల్లో నుంచే తన హవా కొనసాగిస్తోంది. సెల్‌లో కూర్చునే ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. సూచనలు, సలహాలు ఇస్తోంది. ఈమధ్య కొందరు మంత్రులు జైల్లో చిన్నమ్మను కలుసుకొని మాటామంతీ జరిపారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదుగాని పరిపాలనకు సంబంధించి ఆమె మంత్రులు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. విద్యాశాఖమంత్రి సెంగోటయ్యన్‌, ఆహార, పౌరసరఫరాల మంత్రి కామరాజ్‌, అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్‌, సహకార శాఖ మంత్రి సెల్లూర్‌ కె.రాజు తదితరులు చిన్నమ్మను కలుసుకొని మాట్లాడారు. వీరు రెగ్యులర్‌గా ఆమెతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో వస్తున్నారు మాట్లాడుతున్నారులే అన్నట్లుగా ఉన్నారు. కాని ఒకాయనకు కోపం వచ్చింది. జైల్లో ఉన్న వ్యక్తి అక్రమాస్తుల కేసులో దోషి. ఆమెతో  మంత్రులు మాట్లాడటమేమిటి? పాలకులు దోషి సలహాలు, ఆదేశాలతో పనిచేయడమేమిటి? ఇది నైతికంగా, రాజ్యాంగపరంగా తప్పు కదా.

నిజమే...రాష్ట్రాన్ని పరిపాలించేది ప్రభుత్వమా? జైల్లో ఉన్న దోషా? ఈ అరాచకాన్ని ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవడంలేదు? అందుకే ఆయన పట్టించుకున్నాడు. పేరు 'ట్రాఫిక్‌ రామస్వామి'. ఈ సామాజిక కార్యకర్త తమిళనాడులో చాలా పాపులర్‌. అన్యాయం జరుగుతోందని, అరాచకం నడుస్తోందని భావించినప్పుడల్లా న్యాయస్థానం గడప తొక్కుతుంటాడు. జయలలిత జైల్లో ఉన్నప్పుడు ఇదే పనిచేసిన ట్రాఫిక్‌ రామస్వామి చిన్నమ్మను పరప్పన అగ్రహారం జైలు నుంచి మార్చాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు.  శశికళ కోరుకుంటున్నట్లు తమిళనాడు జైలుకు పంపాలని రామస్వామి కోరలేదు. కర్నాటకలోని తుమకూరు జైలుకు పంపాలని కోరారు. ఏమిటి దీని ప్రత్యేకత? ఇది పూర్తిగా మహిళల జైలు. దీంతో సహజంగానే ఇక్కడ భద్రత, నిబంధనలు కఠినంగా ఉంటాయి. మగవారికి ప్రవేశం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్లి మాట్లాడటం కుదరదు. శశికళను అక్కడికి పంపితే ఆమె తిక్క కుదురుతుందని, హవా తగ్గుతుందని రామస్వామి భావిస్తున్నారు. 

ఆమె వదిన ఇళవరసిని కూడా అక్కడికే తరలించాలని పిటిషన్లో కోరారు. దీనిపై కర్నాటక హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. జయలలిత చెన్నయ్‌ అపోలో ఆస్పత్రిలో 75 రోజులు ఉండి చికిత్స పొందినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, వైద్యం గురించి సరైన వివరాలు బయటకు వెల్లడించని సంగతి తెలిసిందే. అప్పుడు ఆ వివరాలు బయటపెట్టాలని కోరుతూ ట్రాఫిక్‌ రామస్వామి హైకోర్టులో పిటిషన్‌  వేశారు.  అమ్మ ఆరోగ్య పరిస్థితి తెలియచేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.  ఆందోళనలు నిర్వహించారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. అనేకమంది ఆస్పత్రి దగ్గర పడిగాపులు పడ్డారు.  ప్రార్థనలు, పూజలు చేశారు. 

ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్‌ రామస్వామి 'జయలలిత ఆరోగ్యానికి సంబంధించి అసలు విషయం తెలియచేయాలి' అని డిమాండ్‌ చేశారు. సాధారణ మిల్లు వర్కరైన రామస్వామి మద్రాసులో ట్రాఫిక్‌ను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో ట్రాఫిక్‌ రామస్వామిగా పాపులర్‌ అయ్యారు. కొంతకాలం ఆయనే స్వచ్ఛందంగా ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు గుర్తింపు కార్డు ఇచ్చింది. అన్యాయం ఎక్కడ జరిగినా రామస్వామి స్పందిస్తారు. వెంటనే దాన్ని ప్రశ్నిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తారు. ఈ కారణంగా ఆయనపై కొన్నిసార్లు దాడులు కూడా జరిగాయి. అయినా తన పని తాను చేసుకుపోతున్నారు. శశికళను తుమకూరు జైలుకు మారిస్తే అన్నాడీఎంకే మంత్రులకు దారి మూసుకుపోయినట్లే. Readmore!

Show comments

Related Stories :