అభివృద్ధి.. పొలిటికల్‌ మార్కెటింగ్‌.!

అభివృద్ధి పేరుతో పచ్చని పంట పొలాల్ని ఎలా నాశనం చెయ్యొచ్చు.? అన్న విషయం తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అడగాలి. ఎందుకంటే, ఆయనకి ఆ విషయంలో మాస్టర్‌ డిగ్రీ వుంది మరి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాల భూముల్ని సమీకరించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇందుకు ప్రతిగా వెయ్యి గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్‌ ప్లాట్లు.. రైతులకు అప్పగిస్తారు. ఈ ప్యాకేజీలో చిన్న చిన్న మార్పులూ వున్నాయనుకోండి.. అది వేరే విషయం. చంద్రబాబు కన్నా, గొప్పగా రైతుల గురించి ఆలోచించేవాళ్ళు ఇంకెక్కడుంటారు.? 

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. భూ సమీకరణ అనేది చంద్రబాబు కోసమే పుట్టినట్లుంది. అందుకే, ఎడా పెడా ఆ భూ సమీకరణను ప్రయోగించేస్తున్నారు చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంతేనా, బందరు పోర్ట్‌ విస్తరణ విషయంలోనూ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. 'చంద్రబాబు రైతుల పక్షపాతి.. అందుకే రైతుల బాధల్ని అర్థం చేసుకుని.. వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నారు..' అని టీడీపీ చెబుతోంది. 

రైతుల నుంచి అమరావతి కోసం భూములు లాక్కున్నారు సరే, ఏదీ.. రాజధాని ఎక్కడ.? అన్న ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానం దొరకదు. ప్రస్తుతానికైతే తాత్కాలిక సచివాలయంతో సరిపెట్టుకోవాల్సిందే. అదే రాజధాని అని జనం అనుకోవాలి. బందరు పోర్టు విస్తరణ వ్యవహారమైనా అంతే. అమరావతి కోసం సిఆర్‌డిఎ ఏర్పాటయినట్లే.. బందరుపోర్టు విస్తరణ కోసం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుతో.. జనాన్ని 'బకరాల్ని' చేస్తున్నారు. 

ఎకరా భూముని కోల్పోయే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు 'వెయ్యి ప్లస్‌ రెండొందల యాభై గజాలు' దక్కుతున్నాయి. రైతులు ఆ భూములతో పండగ చేసుకోవాలన్నది చంద్రబాబు సర్కార్‌ ఉవాచ. భూమి వుంటే, అందులో వ్యవసాయం చేసుకుని రైతు ఎలాగోలా బతుకీడుస్తాడు. అదే ప్లాట్ల విషయానికొస్తే, అమ్ముకోడానికి తప్ప, ఎందుకూ పనికిరావవి. మరి, వ్యవసాయం మాటేమిటి.? 

రాజధాని కోసమంటే తప్పదు.. అన్ని సందర్భాల్లోనూ భూ సమీకరణనే ప్రయోగిస్తామంటే, ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ప్లాట్లు తప్ప, ఎకరాల మొత్తంలో భూములు కనిపించవు.. అసలు వ్యవసాయమనేదే వుండదు ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కి అన్నపూర్ణ అన్న పేరుంది. ఇకపై, ఆ పేరుని అంతా మర్చిపోవాల్సిందే. రైతుల నుంచి భూముల్ని సమీకరించడం, వాటిని విదేశాలకు అమ్మేయడం (సారీ సారీ అభివృద్ధి చేయడం) చంద్రబాబుకి మాత్రమే తెలిసిన విద్య. ఎనీ డౌట్స్‌.?

Show comments