కాంగ్రెస్ పార్టీ తరఫున ‘భావి ప్రధాని’ అనే ట్యాగ్ లైన్ ను కొన్ని ఏళ్లుగా తగిలించుకుని... ఆ ఆశలతోనే జీవితాన్ని గడిపేస్తున్న రాహుల్ గాంధీ ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. మరోవైపు అదే పార్టీలోని ప్లేబోయ్ ఇమేజి ఉన్న నాయకుడు శశిథరూర్... పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ.. పెళ్లి లేకపోయినా.. శృంగార విలాసాలకు మాత్రం లోటు లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కూడా దేశ ప్రధాని కావడానికి అర్హతలుగా పరిగణనలోకి వచ్చేలా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ కంటె శశిథరూర్ ను కాంగ్రెస్ పార్టీతరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మేలు జరుగుతుందంటూ ఒక కొత్త ప్రచారం ప్రారంభం అయింది.
ఈ ప్లేబోయ్ నాయకుడిని ప్రధానిగా తెరమీదకు తేవడానికి ప్రయత్నిస్తున్నది కేరళలోని ఆయన సొంత నియోజకవర్గంలోని ఒక వ్యక్తే. రాహుల్ గాంధీ లో దేశానికి ప్రధాని కాగల స్థాయి సమర్థత లేదనే సంగతి తేలిపోయిందని, కనుక ఎంచక్కా ఆయనను పక్కన పెట్టి శశిథరూర్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంటున్నారు.
థరూర్ నియోజకవర్గం అయిన తిరువనంతపురంలోని ఓ వ్యక్తి.. ఆన్ లైన్ లో ఓ పిటిషన్ పెట్టి దీనిపై సంతకాల సేకరణ చేపట్టారు. రాహుల్ వద్దు, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై ఎంతో పట్టు ఉన్న శశిథరూర్ ను ఎంచుకోవాలి అని ఆయన ఆ పిటిషన్లో పేర్కొంటున్నారు. ప్లేబోయ్ థరూర్ కు మద్దతుగా 15 వేల సంతకాలు సేకరించడం ఆయన లక్ష్యంకాగా, అప్పుడే 12 వేల సంతకాలు దాటిపోయాయిట.
పరిస్థితి చూస్తే పాపం రాహుల్ అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కేవలం రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అనే భజన చేసుకోవడం ఒక్కటే పాటిస్తూ.. నాయకులుగా జీవితాలు గడిపేస్తున్న వ్యక్తులు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారందరికీ ఇలా ప్రజలు ప్రత్యమ్నాయాలు చూస్తున్నారనే సంగతి చేదుగా కనిపించవచ్చు. కానీ.. రాహుల్ గాంధీ సమర్థత మీద అందరికీ నమ్మకం సడలిపోతున్నదనే వాస్తవాన్ని వారు గుర్తించకపోతే మాత్రం వారికే చేటు జరుగుతుంది.