ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులెవరూ పనిచేయడంలేదు. కొత్తవాళ్లకు పనిచేయడం తెలియడంలేదు. పాతోళ్లు పనిచేయకుండా తప్పించుకుంటున్నారు. అంటే టోటల్‌గా అందరూ ఖాళీగానే ఉంటున్నారన్న మాట. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కాదు. పరిపాలనలో సగం కాలం పూర్తయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాట. మంత్రులు పనిచేయడంలేదంటూ బాబు తీవ్రస్థాయిలో క్లాసు తీసుకున్నారట...! కొందరు అవినీతికి పాల్పడుతున్నారని కూడా బాబు చెప్పారు. తప్పులు దిద్దుకోకపోతే తానే రంగంలోకి దిగి వేటు వేస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో తాను బాగా పనిచేస్తున్నానని చెప్పుకున్నారు.
తాను నిత్య విద్యార్థినని, ప్రతిదీ తెలుసుకోవాలని తాపత్రయపడతానని, మంత్రుల్లో అది లోపించిందని అన్నారు. ప్రజలు తప్పు చేస్తే ప్రభువుకే (రాజుకు) శిక్ష పడాలన్నారు వెనకటి పెద్దలు. మంత్రులు సరిగా పనిచేయడంలేదంటే అందుకు ముందు శిక్ష పడాల్సింది బాబుకే. పనిచేయనివారిని తీసేసి పనిచేసేవారిని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. రెండున్నరేళ్లయినా ఆ పని ఎందుకు చేయలేదు? అవినీతిపరులను ఎందుకు సహిస్తున్నారు? పాలనా కాలం సగం పూర్తయ్యాక 'జాగ్రత్తగా ఉండండి..వేటు వేస్తాను' అని హెచ్చరించడం ఏమిటి?
తాను అత్యంత నిజాయితీపరుడినని, జీవితంలో ఒక్క తప్పూ చేయలేదని తరచుగా చెప్పుకునే సీఎం అవినీతిపరులను, పనిచేయనివవారిని తన ఆస్థానంలో పెట్టుకొని ఎందుకు పోషిస్తున్నారో ప్రజలకు చెప్పాలి. మంత్రులు పనిచేయడంలేదని, తానొక్కడినే ఇరవైనాలుగు గంటలూ కష్టపడుతున్నానని అనుకూల మీడియాలో ప్రచారం చేసుకొని సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు మంత్రులకు క్లాసు పీకడం ఇవాళ కొత్తది కాదు. 'నేను ఉత్తమ...ఎదుటివారు అధమ' అని చెప్పుకోవడం ఆయనకు మొదటినుంచి అలవాటు. 'నేను కష్టపడుతున్నాను' అని ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం.
నిజానికి కష్టపడటమేమిటి? ముఖ్యమంత్రిగా తన విధులు తాను నిర్వహిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు తాము కష్టపడుతున్నామని రోజూ చెప్పుకొని ఆవేదన చెందరు కదా. ఎవరి పని వారు చేస్తుంటారు. కాని బాబు తీరు వేరు. ప్రభుత్వమంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు...ఇలా అందరి, అన్ని వ్యవస్థల కలయిక. అందరూ సమన్వయంతో పనిచేయాలి. అలా పనిచేయించే బాధ్యత ముఖ్యమంత్రిదే. ఆ బాధ్యతను వదిలేసి 'మీరు పనిచేయడంలేదు. నేనొక్కడినే పనిచేస్తున్నాను' అని చెప్పుకోవడం ఎంతవరకు సబబు? ఇది తనకే అమానమని ఆయన గ్రహించడంలేదు.
'ప్రభుత్వానికి మంచి పేరొస్తున్నా మంత్రులకు రావడంలేదు' అంటున్నారు. ప్రభుత్వం వేరు మంత్రులు వేరా? ఇదేం లాజిక్? నిజానికి ఎవరి పని వారిని చేయనిస్తే బాగానే పనిచేస్తారు. కాని చంద్రబాబు అన్ని పనులు తానే మీదేసుకొని చేస్తుంటారు. 'తానొకడైనా తలకొక రూపై'...అన్నట్లుగా అన్ని చోట్లా తానే కనబడాలని, అన్ని పనులూ తానే చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇలాంటప్పుడు మంత్రులకు చేయడానికి పనెక్కడ ఉంటుంది? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తనకు ఏం కావాలో, ఏం పనిచేయాలో స్పష్టంగా చెప్పి వెళ్లిపోతారు. గడువు తరువాత ఫలితాల కోసం అడుగుతారు. అంతేతప్ప అదేపనిగా జోక్యం చేసుకోరు. ప్రచారమూ చేసుకోరు.
ఉదాహరణకు...కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటినుంచి, అంతకు ముందు కూడా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడైనా సీన్‌లో ఉన్నారా? 'అంతా రామమయం' అన్నట్లుగ అంతా చంద్రమయమైపోయింది. మరో ధ్యాస లేకుండా పుష్కరాలపై ప్రచారం చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అది శృతి మించిపోతోంది. తాజాగా ఆయన పార్టీ నాయకులకు మరో పిలుపునిచ్చారు. వారు ఊళ్లలో ప్రజల వద్దకు వెళ్లి పుష్కర స్నానాలు చేశారా? అని అడగాలట...! ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి పుష్కరాలను అవకాశంగా తీసుకోవాలట...!
ఇక చంద్రబాబు కొన్ని గంటలపాటు ఏకబిగిన మంత్రులతో, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. అవి తలనొప్పిగా మారాయని వారు చాటుమాటున ఆవేదన చెందుతున్నారని పత్రికల్లో వార్తలొచ్చాయి. గంటలపాటు మీటింగులు పెట్టి వాయిస్తే వాళ్లు ఇంకేం పనిచేస్తారు? తాజాగా పరిశ్రమల శాఖ అధికారులపై మండిపడ్డారు. 'నేను చాకిరీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు?' అని క్లాసు తీసుకున్నారు. తాను దేశదేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్నా అధికారులు ఏం చేయడంలేదని అన్నారు. పరిశ్రమలు రావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాబు ఒక దేశానికి వెళ్లి ఒప్పందాలు చేసుకున్న మర్నాడే డబ్బు సంచులు ఊడిపడతాయా? పరిశ్రమలు పెట్టడమంటే పేక మేడలు కట్టడం కాదు కదా. ప్రతి రోజు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్న బాబుకు పారిశ్రామిక ప్రగతి ఎలా ఉందో తెలియదా? పనితీరు సరిగా లేని మంత్రులను మార్చుకోవాలిగాని దోషులుగా మీడియాలో ప్రచారం చేయడమెందుకు?