తుగ్లక్‌ పాలనలో మరో కామెడీ.!

పార్కింగ్‌ చేయడానికి 'స్పేస్‌' చూపించగలిగితేనే ఇకపై సొంత కారు కొనుక్కోడానికి ఎవరైనా అర్హత సాధిస్తారు. తుగ్లక్‌ పాలనలో ఇదో తాజా సంచలనం. అతి త్వరలో దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ మేరకు సంకేతాలు పంపించారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ఏ గల్లీలో చూసినా అడ్డదిడ్డంగా పార్క్‌ చేసి వున్న కార్లు కన్పిస్తాయి. నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తుంటుంది. ఏం చేస్తాం.? వుండటానికే చోటు దక్కదు.! ఎందుకంటే, మనది జన భారతం. నగరాలు జనసంద్రాలుగా మారిపోతున్నాయి. వారి వారి అవసరాల కోసం వాహనాల్ని కొనుగోలు చేయడం అనేది తప్పు పట్టే విషయం కాదు. అదే సమయంలో, అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసి వున్న వాహనాల తీరునీ సమర్థించలేం.! 

అలాగని, 'పార్కింగ్‌ స్పేస్‌ వుంటే తప్ప, వాహనం కొనుగోలుకి వీలు లేదు..' అనే నిబంధన తెచ్చేయడం సమర్థనీయమా.? దీనిపై భిన్నాభిప్రాయాలు సహజంగానే విన్పిస్తాయి. భవిష్యత్తులో మంచి జరుగుతుందంటే, ఏ నిర్ణయాన్నయినాసరే సమర్థించి తీరాల్సిందే. కానీ, మంచి మాటేమోగానీ.. తుగ్లక్‌ నిర్ణయాలతో జనాన్ని రోడ్డున పడేస్తేనే సమస్య వచ్చిపడ్తుంది. పెద్ద పాత నోట్ల రద్దు పేరుతో జనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఇలాగే రోడ్డున పడేశారు. 

దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు సొంత కార్లు లేవు. ఒట్టు, నిజమిది. నమ్మితే నమ్మండి, లేకపోతే ఎన్నికల కమిషన్‌కి ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లు చూస్కోండి. రాజకీయ నాయకులకు సొంత కార్లు తక్కువగా వుంటాయి కాబట్టి, కొంతమందికి అసలే వుండవు కాబట్టి, ఈ నిర్ణయాన్ని సమర్థించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆగండాగండీ, అధికారికంగా లేవన్నాంగానీ, అనధికారికంగా ఎందుకు లేవు.? కుప్పలు తెప్పలుగా వుంటాయ్‌.! 

Readmore!

కార్లు - పార్కింగ్‌ - అనుమతులు ఇదంతా గందరగోళంగానే అన్పించకమానదు. ఇక్కడితో ఈ తుగ్లక్‌ డెసిషన్స్‌ అయిపోయినట్టేనా.? అంటే, ఏమో.. రేప్పొద్దున్న సొంత నివాసం వుంటే తప్ప పెళ్ళి చేసుకోడానికి వీల్లేదు, పిల్లల్ని కనడానికి వీల్లేదని రేప్పొద్దున్న ఇంకో తుగ్లక్‌ నిర్ణయం వచ్చినా రావొచ్చుగాక.! ఎందుకంటే, దేశంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది మరి.

Show comments