జగన్‌, చంద్రబాబు.. నో బడీ కెన్‌ ఎస్కేప్‌

నేరారోపణలు ఎదుర్కొనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చాలా చిన్న విషయం. అందుకే, నేర చరిత్ర వున్నవారు చట్ట సభల్లోకి ధైర్యంగా అడుగు పెట్టేస్తున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయ సంక్షోభం తర్వాత, దేశంలో 'ప్రక్షాళన' ప్రారంభమైందా.? అన్న చిన్న ఆశతోపాటుగా, దేశ రాజకీయాలు ఏమైపోతాయోనన్న పెద్ద ఆందోళన కూడా కన్పిస్తోంది.

శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితురాలు గనుక, ఆమె ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్‌ ఒప్పుకోలేదు. ఇప్పుడామె దోషి. దాంతో, గవర్నర్‌ నిర్ణయాన్ని ఎవరూ ఇప్పుడు ప్రశ్నించలేని పరిస్థితి. మరోపక్క, శశికళ స్థానంలో వచ్చిన పళనిస్వామిపైనా క్రిమినల్‌ కేసులున్నాయి. ఇప్పుడాయన పరిస్థితేంటి.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి. 

ఇదేదో కేవలం తమిళనాడుకి మాత్రమే చెందిన వ్యవహారంగా తీసి పారెయ్యలేం. 2019 నాటికి పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. చంద్రబాబు మీద ఓటుకు నోటు కేసు వుంది.. అప్పుడూ వుంటుంది. వైఎస్‌ జగన్‌ మీద అక్రమాస్తుల కేసు వుంది.. అప్పుడూ వుంటుంది. చంద్రబాబు, జగన్‌ మాత్రమే కాదు.. దేశంలో చాలామంది రాజకీయ ప్రముఖుల మీద ఏదో ఒక కేసు వుంటూనే వుంటుంది. ఎందుకంటే, రాజకీయాల్లో వున్నవారిపై 'క్రిమినల్‌' కేసులు సర్వసాధారణం. అదొక 'క్వాలిఫికేషన్‌'లా తయారయ్యింది మరి.! 

ఈ లెక్కన, 2019 ఎన్నికల్లో ఎవరు గెలిచినా, గవర్నర్లు ఇలాగే చేస్తారా.? చెయ్యాల్సిందే కదా మరి.! శశికళ విషయంలో జరిగినట్లు, ఇంకొకరి విషయంలో జరగకపోతే ఎలా.? కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే, వాళ్ళు చెప్పినట్లే గవర్నర్లు వినాల్సిన దుస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకుంటే గనుక, అప్పుడిక బీజేపీ నేతలకీ ఇవే కష్టాలు తప్పవు. బీజేపీ నేతలు కేసులకు అతీతం ఏమీ కాదు కదా. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపైనా ఆరోపణలున్నాయి. అంతెందుకు, ప్రధాని నరేంద్రమోడీ మీద కూడా క్రిమినల్‌ కేసులున్నాయి. వాటి నుంచి ఆయా నేతలు ప్రస్తుతానికి ఊరట పొందినా, అవి తిరగబడవన్న గ్యారంటీ లేదు. అందుకు శశికళ, జయలలిత అక్రమాస్తుల కేసులే నిదర్శనం. 

ఏదిఏమైనా, నేరచరితులు చట్టసభల్లోకి అడుగు పెట్టకుండా చేయాలన్న ఆలోచన నూటికి నూరుపాళ్ళూ అభినందించదగ్గదే. అదే సమయంలో, ఈ తరహా విధానం కేవలం ప్రత్యర్థుల కోసం మాత్రమే ఉపయోగించడమంటే, దేశంలో రాజకీయ అరాచకానికి ఇది నాందిగా భావించాల్సిన పరిస్థితులేర్పడతాయన్నది నిర్వివాదాంశం.

Show comments