పన్నీరు.. రాజీనామా చేస్తున్నాడా?!

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం రాజీనామా చేస్తాడని అంటున్నారు ఆ రాష్ట్ర మంత్రులు. శశికళకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి పన్నీరు రెడీగా ఉన్నాడని వారు చెబుతున్నారు. శశికళ అన్నాడీఎంకే అధినేత్రి పదవిని  చేపట్టడంతో పాటు సీఎం పదవిని కూడా అధిష్టిస్తుందని.. ఈ మేరకు పన్నీరు నుంచి సహకారం లభిస్తుందని వారు చెబుతున్నారు.

ఈ మాట చెబుతున్నది శశికళ వర్గంగా పేర్గాంచిన మంత్రులు కావడం గమనార్హం. శశికోసం పన్నీరు సెల్వం రాజీనామానే చేస్తున్నాడని వీరు చెబుతున్నారు! అంటే ఇన్నాళ్లూ.. జయలలిత కోసం ముఖ్యమంత్రి పదవిని ఎక్కుతూ, దిగుతూ వచ్చిన పన్నీరు ఇప్పుడు శశి కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా! అనే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ మాటలు మాట్లాడుతున్న వారు శశికళ వర్గీయులు కాబట్టి.. వీరు పన్నీరు విషయంలో కల్పిత వ్యాఖ్యానాలు చేసి ఉండవచ్చని అనుకోవాల్సి వస్తోంది.

మరి కొన్ని గంటల్లో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నేపథ్యంలో పన్నీరు రాజీనామా చేస్తాడు, శశికళ సీఎం పదవిని చేపడుతుందని ఆ పార్టీ నేతలు, మంత్రులు మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా ఉంటుందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి ఇలాంటి వ్యాఖ్యానాలు.  

ఈ సర్వసభ్యసమావేశంలో శశిని పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కోరతారా? లేక పన్నీరు కూడా రాజీనామా చేయాలి.. ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెనే చేపట్టాలనే వాయిస్ గట్టిగా వినిపిస్తుందా? అనేవి ఆసక్తికరమైన అంశాలు. మరోవైపు టార్గెట్ శశికళగా ఐటీ దాడులు ముమ్మరం కాబోతున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికే శేఖర్ రెడ్డి, సీఎస్ రామ్మోహన్ ల తర్వాత మరికొందరిపై కూడా ఐటీ శాఖ దాడులు ఉండబోతున్నాయని.. శశిని ఇరుకున పెట్టడానికి కేంద్రం ఈ పనులు చేయిస్తోందని అంటున్నారు.

పన్నీరును రక్షించుకోవడానికి బీజేపీ ఈ వ్యూహాన్ని అవలంభిస్తోందంటున్నారు. మొత్తానికి నేటి నుంచి తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని మాత్రం స్పష్టం అవుతోంది. 

Show comments