బీజేపీని పార్లమెంటులో టీడీపీ నిలదీస్తుందా.?

పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని నిలదీద్దామనుకున్నామనీ, దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించాలనుకున్నామనీ, అయితే కాంగ్రెస్‌ ఆందోళనలతో అది సాధ్యం కాలేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కరెన్సీ ఎమర్జన్సీ కారణంగా పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యింది. బ్యాంకులు వినియోగదారులకు సేవలు అందించలేక చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితి సుస్పష్టంగా కన్పిస్తోంది. 

'బ్యాంకుల్లో వున్న మా సొమ్ముని మేం తీసుకుని, వాడుకునేందుకు ఈ ఆంక్షలేంటి.?' అని దేశ ప్రజానీకం ప్రశ్నిస్తోన్న దరిమిలా, డిమాండ్‌కి తగ్గట్టుగా నగదుని బ్యాంకులకు చేరవేయలేక ఆర్‌బిఐ కూడా చేతులెత్తేసింది. 'కావాల్సినంత నగదు వుంది.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు..' అని ఆర్‌బిఐ చెబుతున్నా, ఆర్‌బిఐ మాటలకి, బ్యాంకుల్లో నగదు లావాదేవీలకీ పొంతనే లేకుండా పోయింది. 

కరెన్సీ మార్పిడి ఓ ప్రసహనంగా మారిపోయిన వేళ, తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. అందునా, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇంకా భయంకరంగా వుందని సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్న పరిస్థితి. రావాల్సిన కరెన్సీ ఆర్‌బిఐ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రాకపోవడంతో, జనం విలవిల్లాడుతున్నారు. బ్యాంకులు ప్రజలకు సమాధానం చెప్పలేక గింజుకుంటున్నాయి. 

ఈ పరిస్థితులపై ఎందుకు స్పందించడంలేదు.? అని ఓ చర్చా కార్యక్రమంలో సీఎం రమేష్‌ని ప్రశ్నిస్తే, ఆయన సమాధానం.. చాలా హాస్యాస్పదంగా వుంది. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తామని ఇదే సీఎం రమేష్‌ గతంలో చెప్పారు. ఏం జరిగింది.? ప్రత్యేక హోదా విషయంలో ఏం జరిగిందో, ఇప్పుడూ అదే జరగబోతోంది. ఇందులో ఇంకో మాటకు తావులేదు.  Readmore!

కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులున్నారు. ఆ కేంద్రమంత్రుల ద్వారా రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధానికి ఫిర్యాదు చేయించలేకపోవడం హాస్యాస్పదమే. పైగా, కేంద్రాన్ని నిలదీస్తామంటున్న సీఎం రమేష్‌, ఆ నిలదీసేదేదో పదవులకు రాజీనామా చేసి నిలదీయొచ్చు కదా.. అని ప్రవ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడంలేదాయె. 

ఇదిలా వుంటే, ప్రత్యేకహోదాపై చర్చకు పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు నోటీసు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. దాంతో, మరోమారు ఈ అంశం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగే అవకాశముంది. ప్రత్యేక హోదా చెల్లని నోటు.. అని ఇప్పటికే కేంద్ర మంత్రి సుజనా చెప్పేసిన దరిమిలా, వైఎస్సార్సీపీ పార్లమెంటు పోరు ఏమవుతుందో.! పార్లమెంటులో పోరు, అనంతరం ఎంపీల రాజీనామా.. అని ఇప్పటికే జగన్‌, ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం విదితమే.

Show comments