విశాఖ నుంచి ఇద్దరు మంత్రులనూ సాగనంపి..!

ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇప్పటివరకూ రాజకీయ మార్పు చేర్పులకు పెద్దగా సాహసించని చంద్రబాబుకు సైతం ఈ రాజకీయ వివాహ బంధం వెసులుబాటు కల్పిస్తోంది. విశాఖ జిల్లాలో అయ్యన్నను కాదనలేక, గంటాను వదులుకోలేక సతమతమవుతూ వస్తున్న బాబు మూడేళ్ల పాలన పూర్తవుతున్న వేళ మంత్రివర్గ విస్తరణలో స్వేచ్ఛగా వ్యవహరించేందుకూ ఈ పరిణామం వీలు కల్పిస్తోంది. ఈ తడవ విశాఖ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులనూ సాగనంపి తనదైన ముద్రతో కొత్త వారిని చేర్చుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

చీటికీ మాటికీ బాబు సర్కార్‌పైన విమర్శలు చేస్తూ స్వపక్షంలోనే విపక్షంగా తయారైన అయ్యన్న వైఖరి పట్ల బాబు గుర్రుగా ఉంటున్నారు. పార్టీలో  బాబు కంటే సీనియర్‌నని తరచూ చెప్పే అయ్యన్న ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు అధినేతకు అగ్రహం తెప్పించాయని అంటున్నారు. గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్‌లు దండుగమారి వ్యవహారమని తాజాగా విమర్శించిన అయ్యన్న సంక్రాంతి కానుకల పేరుతో ఏటా వేయి కోట్ల పై చిలుకు సొమ్మును తగలేస్తున్నారని కూడా సైటెర్లు వేశారు. తాను ప్రాతనిధ్యం వహిస్తున్న నర్శీపట్నం నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయకపోగా జిల్లాలో సీనియర్‌ మంత్రిగా కూడా తన ముద్రను వేసుకోలేకపోయారు. 

మరో మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం టీడీపీని, అధినాయకత్వాన్ని ధిక్కరించేలా తన సొంత పోకడలతో ముందుకు సాగిపోతున్నారు. పసుపు పార్టీలో ఉన్నా తన సొంత కోటరీని పెంచి పోషిస్తూ జిల్లాలో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో, ఇద్దరు నేతలకు చెక్‌ పెట్టాలనుకుంటున్న బాబుకు తటస్థునిగా, సీనియర్‌గా బండారు బలమైన ప్రత్యామ్నాయం అవుతారని అంటున్నారు. ఇక, విజయనగరం జిల్లాలోనూ కిమిడి మృణాళినిని పక్కన పెట్టడం ద్వారా ఆ జిల్లాలో వెలమలను బాబు ప్రోత్సహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ వైపుగా వచ్చిన బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావుకు మంత్రి మండలిలో చోటు ఇవ్వడం ద్వారా వెలమల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు బాబు మార్క్‌ పాలిట్రిక్స్‌ చేస్తారని చెబుతున్నారు.

 శ్రీకాకుళంలో అటు అచ్చెంనాయుడు, ఇటు కళా వెంకటరావులను మంత్రులుగా చేయడం ద్వారా సిక్కోలు రాజకీయాలలో రెండు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేందుకు యత్నిస్తారంటున్నారు. ఈ నూతన రాజకీయ సమీకరణలలో వెలమలకు గతంలో కంటే మరింత ప్రాధాన్యత తప్పనిసరిగా లభిస్తుందని కూడా అంటున్నారు. తన సొంత ఇంటిలో పెళ్ళిళ్లకు టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్‌ దంపతుల ఫోటోలను వేయడమే కాదు, చంద్రబాబు కుటుంబం ఆశీస్సులతో అంటూ శుభలేఖలు ముద్రించిన బండారు రాజకీయ బంధాన్ని అధికార సోపానానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలో అపుడే చేసి చూపించేశారు.

మార్చి నెలలో జరిగే ఈ వివాహానికి బాబును స్వయంగా ఆహ్వానించి ఉత్తరాంధ్ర రాజకీయాలలో సరికొత్త మార్పుచేర్పులకు నాంది ప్రస్ధావన చేసేందుకు బండారు ఉవ్విళ్లూరుతున్నారు. బాబు సైతం కింజరపు, బండారు రాజకీయ బాంధవ్యం పట్ల అత్యంత సానుకూలంగా వ్యవహరించడమే కాదు, కుటుంబ పెద్దలా తాను దగ్గరుండి వివాహం జరిపిస్తానంటూ ఇప్పటికే భరోసా ఇచ్చారు. రానున్న రోజులలో ఈ రాజకీయ బంధం మరెన్ని నూతన ఆవిష్కరణలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

Show comments