పీవీసిందు ఒలింపిక్స్ రజతపతకం సాధించడం ద్వారా భారతజాతి ప్రతిష్టను పెంచింది. అయితే ఆ కీర్తిని తమ కీర్తిగా మార్చుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరాటపడిపోతున్నాయి. చంద్రబాబు ఘనంగా మూడుకోట్ల రూపాయల కానుక ప్రకటిస్తే.. కేసీఆర్ ఏకంగా అయిదు కోట్లతో తనకు తిరుగులేదని చాటుకున్నారు. చంద్రబాబు పరిస్థితి పాపం.. మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైపోయింది. ముందుగా తాను ప్రకటించినందుకు ఇప్పుడు వెనకబడ్డానని ఆయన అనుకుంటున్నారు. అదే కేసీఆర్ ప్రకటించే వరకు ఆగి ఉంటే... తానే ఎక్కువ ఇచ్చి ఉండచ్చునని అనుకుంటున్నారు. అయితే డేమేజి జరిగిపోయింది.
చంద్రబాబుకు జరిగిన ఈ డేమేజిని పూడ్చడానికి చినబాబు నారా లోకేష్ ఓ సరికొత్త అయిడియా ప్లాన్ చేశారని రాజకీయ వర్గాల్లో ఓ పుకారు వినిపిస్తోంది. ప్రభుత్వాలు ఇప్పుడు సర్కారు సొమ్మును మాత్రమే పీవీ సింధుకు ఇచ్చాయి. తెలంగాణలో ఆమెకు సన్మానం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం కూడా పూర్తయిపోయింది. అయితే అయితే ఇవాళ ఆంధప్రదేశ్ సన్మానం జరగబోతున్నది. కృష్ణా పుష్కరాల్లో బెజవాడ దుర్గ ఘాట్ లో మునగబోతున్నది.
అయితే ఈ రోజు తమ ప్రభుత్వం చేసే సన్మానం సందర్భంగా చంద్రబాబుకు జరిగిన డేమేజిన కంట్రోల్ చేయవచ్చునని చినబాబు లోకేష్ ప్లాన్ చేశారుట. ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు చెరి వెయ్యి గజాల స్థలాలు, చెరి ఒక ఉద్యోగం ఇలా ఇచ్చాయి. అయిదు కోట్లతో డబ్బుగా కేసీఆర్‌ది పైచేయిగా ఉంది. ఇవాళ సన్మానంలో ప్రభుత్వం తరఫున చంద్రబాబు ఆమెకు రూ. 3కోట్ల చెక్కు బహూకరిస్తారు. అలాగే.. తెలుగుదేశం పార్టీ తరఫున మరో రెండు కోట్ల రూపాయల చెక్ ఇస్తే.. డేమేజి కంట్రోల్ అవుతుందని.. కానీ తమకు ప్రతిష్ట దక్కుతుందని.. యావత్ ప్రభుత్వ డబ్బును తగలేసేయడం మాత్రమే కాకుండా.. తమ పార్టీ డబ్బును కూడా అభినందించడానికి వాడగలమన్న స్ఫూర్తిని ప్రచారం చేసినట్లుగా పాజిటివ్ కీర్తి దక్కుతుందని లోకేష్ ప్లాన్ చేస్తున్నారట.
చంద్రబాబుకు జరిగిన డేమేజి కంట్రోల్‌కు చినబాబు అయిడియా బాగానే ఉంది. కానీ.. పార్టీ సొమ్ము అంటే తమ జేబులోంచి డబ్బు ఇవ్వడం లాగా నాయకులు ఫీలయిపోతారు కదా.. ఏదో ప్రభుత్వ సొమ్ము అంటే ధారాళంగా విశాల హృదయంతో ఇచ్చేయడానికి ముందుకు వస్తారు గానీ.. పార్టీ సొమ్ము కూడా రెండు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం అంటే అందుకు వారు అంగీకరిస్తారో లేదో అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.