అరెవో సాంబా.. రాస్కోరోయ్‌.!

ఉత్తరాంధ్ర ప్రాంతం పేరు చెప్పగానే, ముందుగా కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. కిడ్నీ వ్యాధి పీడితులకు అండగా వుంటానంటూ కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నానా 'యాగీ' చేసిన విషయం విదితమే. బాధితుల దగ్గరకు వెళ్ళాల్సింది పోయి, బాధితుల్నే తన వద్దకు తెచ్చుకుని, వారి బాగోగుల్ని తెలుసుకుని, 'మమ' అన్పించేశారు. 

అక్కడినుంచే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన పవన్‌, ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారనుకోండి.. అది వేరే విషయం. జనసేన తరఫున కమిటీ వేస్తామన్నారు.. ముఖ్యమంత్రితో భేటీ అయి, ఆ నివేదికను అందజేస్తానన్నారు.. ఆ తర్వాత అంతా 'తుస్‌' అయిపోయింది. 

కామెడీ ఏంటంటే, పవన్‌కళ్యాణ్‌ సూచనల్ని పాటిస్తామంటూ చంద్రబాబు సర్కార్‌ ఒకింత హడావిడి చేసి, ఆ తర్వాత చేతులెత్తేసింది. కిడ్నీ బాధితుల వెతలు అప్పుడెలా వున్నాయో, ఇప్పుడూ అలాగే వున్నాయక్కడ. కానీ, పవన్‌కళ్యాణ్‌ సూచనల్ని పాటించేశామని చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంటోంది. 

తాజాగా, మిర్చికి మద్దతుధర విషయంలో కేంద్రం నుంచి కొంత సానుకూల ప్రకటన వచ్చింది. ఆ క్రెడిట్‌లో కొంత భాగాన్ని జనసేన ఖాతాలో వేసేసి, మెజార్టీ క్రెడిట్‌ని టీడీపీ - బీజేపీ తమ ఖాతాలో వేసుకుంటే, మధ్యలో తనకూ వాటా వుందంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సందడి చేస్తున్నారు. 

సరిగ్గా ఈ టైమ్‌లోనే, ఇంకో కామెడీ చేసేశారు పవన్‌కళ్యాణ్‌. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై చంద్రబాబు సర్కార్‌, అలాగే ఏపీపీఎస్సీ సానుభూతితో స్పందించాలట. అలాగని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ లాంటి సూచన ఒకటి చేసేశారు. ప్రామాణిక పుస్తకాలు లేవనీ, సమయం సరిపోదనీ.. ఏవేవో కారణాలు పేర్కొన్నారు పవన్‌. 

అదిరిందయ్యా పవన్‌కళ్యాణూ.! సరిగ్గా రాస్కోడానికి సాంబడు కూడా అందుబాటులో లేడాయె. లేదంటే, ఇలాంటి ఆణిముత్యాలన్నిటినీ క్రోడీకరించేవాడే. ఏమో, రేప్పొద్దున్న చంద్రబాబు సర్కార్‌ కూడా, 'పవన్‌ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాం..' అని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నట్టు, ఈ మధ్య ప్రతి విషయానికీ ఏదోలా పవన్‌ స్పందిస్తుండడంతో జనసేన వర్గాల్లో కొంత ఉత్సాహం కన్పిస్తోంది. 

అయితే, ఈ స్పందనలన్నీ టీడీపీ కనుసన్నల్లో జరుగుతున్నాయనే ఆరోపణలే పవన్‌ అభిమానుల్నీ ఒకింత షాక్‌కి గురిచేస్తున్నాయి. ఏమో, టీడీపీ - బీజేపీ నుంచే పవన్‌ తరఫున ఈ 'ప్రకటనలు - డిమాండ్లు - సూచనలు' వస్తున్నాయేమో.!

Show comments