నవంబరు 8 న జరగబోయే అమెరికా అద్యక్ష ఎన్నిక ఎటు మొగ్గుతుందో తెలియకుండా పోతోంది. ట్రంప్‌పై హిల్లరీకి పది రోజుల క్రితం 8 పాయింట్ల లీడ్ వుంటే అది ప్రస్తుతం 7 కు వచ్చింది. వివిధ సర్వేల సరాసరి చూస్తే 6.1 పాయింట్లు వుంది. ఇప్పుడిలా వున్నా 75 రోజుల తర్వాత కూడా పరిస్థితి యిలాగే వుంటుందని చెప్పలేం. 1988లో జార్జి బుష్, 2000లో అల్ గోర్ యిలాటి వ్యత్యాసాన్ని అధిగమించి నెగ్గగలిగారు. ట్రంప్ విషయంలో ప్రచారం జరిగే తీరు గురించి ఓటర్లలో నిరాశ కలుగుతూండగా, హిల్లరీ విషయంలో ఆమె గతప్రవర్తన గురించి చర్చ జరుగుతోంది. అధికార రహస్య సమాచారానికి సంబంధించిన 15 వేల ఈ మెయిళ్లను ఆమె తన సొంత సెర్వర్ ద్వారా పంపడం వివాదాస్పదం అయింది. ''ఈ విషయం బయటకు రాగానే సెర్వర్‌ను తుడిచిపెట్టివేశారట (వైప్‌డ్ యిట్ ఆఫ్) కదా?'' అని విలేకరులు అడిగితే ఆమె ''ఏమిటి? గుడ్డపెట్టి తుడిచేశానా?'' అని జోక్ చేసి తప్పించుకోబోయింది. కానీ జోక్ పేలలేదు. ఎఫ్‌బిఐ డైరక్టరు తనదేమీ తప్పు లేదన్నాడని ఫాక్స్ టీవీ విలేకరికి ఆమె చెప్పుకున్నది అసత్యమని తేలింది. మీడియా ప్రశ్నలు ఎదుర్కోవడంలో తన భర్తకున్న చాకచక్యం, ఛా(ర్)మ్ తనకు లేవని గ్రహించిన హిల్లరీ 2015 డిసెంబరు తర్వాత సాంప్రదాయకమైన ప్రెస్ మీట్ పెట్టటం లేదు. ఒక్కరే వచ్చి విడిగా అడిగే యింటర్వ్యూలు మాత్రమే యిస్తోంది. ఏదైనా సమావేశం ముగిశాక ప్రెస్ వాళ్లు చుట్టుముట్టి గట్టిగా అరుస్తూ యిబ్బందికరమైన ప్రశ్నలడుగుతూ వుంటారు. వాటికి హిల్లరీ స్పందన అక్వారియం స్టయిల్లో వుందంటున్నారు. అక్వారియంలోని చేపలకు మనకు మధ్యలో గాజు గోడ వుంటుంది. మన పాటికి మనం వాటిని చూస్తూ వుంటాం, కేరింతలు కొడుతూ వుంటాం. వాటి పాటికి అవి ఈదుకుంటూ పోతూంటాయి. అలాగే హిల్లరీ కూడా ప్రశ్నలను పట్టించుకోకుండా చిరునవ్వుతో ముందుకు సాగిపోతోంది.
కానీ క్లింటన్ ఫౌండేషన్ వ్యవహారాల గురించి సోమవారం బయటపడిన ఈమెయిళ్లు అంత తేలికగా చిరునవ్వుతో కొట్టి పారేయదగ్గవి కావు. క్లింటన్ ఫౌండేషన్ (పూర్తి పేరు క్లింటన్ గ్లోబల్ ఇనీషియేటివ్) కు విదేశాల నుంచి విరాళాలు ధారాళంగా వస్తూంటాయి. హిల్లరీ విదేశీ వ్యవహారాల సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పని చేస్తున్నపుడు ఆమె ద్వారా ఏదైనా పని కావాలంటే విదేశీ నాయకులు యీ ఫౌండేషన్‌కు విరాళాలిచ్చి పనులు చేయించుకున్నారని తేలుతోంది. ఉదాహరణకి, బహరైన్ యువరాజు సల్మాన్ బిన్ హమాద్ బిన్ హిల్లరీ క్లింటన్‌తో ఎపాయింట్‌మెంట్ కోసం స్టేట్ డిపార్టుమెంటు ద్వారా ఎంతో ప్రయత్నించాడు. ఎపాయింట్‌మెంటు దొరకలేదు. అప్పుడు హిల్లరీకి సన్నిహితంగా వుంటూ, క్లింటన్ ఫౌండేషన్‌కు, హిల్లరీకి వారధిగా పనిచేసే ఆమె సహాయకురాలు హ్యూమా అబెదిన్‌ను సంప్రదించాడు. హ్యూమా తండ్రి అమెరికాలో స్థిరపడిన భారతీయ ముస్లిము. కాలిఫోర్నియాలో 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ ముస్లిమ్ మైనారిటీ ఎఫయిర్స్' స్థాపించి, దానికి అనుబంధంగా 'ముస్లిము మైనారిటీ ఎఫయిర్స్' అనే పత్రిక వెలువరిస్తూ వుండేవాడు. కూతురుకి 17 ఏళ్లుండగా చనిపోయాడు. హ్యూమా తల్లి పాకిస్తానీ మహిళ. సౌదీలో ఓ యూనివర్శిటీలో టీచరుగా పనిచేస్తూంటుంది. 1996లో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా వుండగా హ్యూమా వైట్‌హౌస్‌లో ఇంటెర్న్‌గా చేరింది. హిల్లరీకి నచ్చింది. అప్పటి నుంచి హిల్లరీనే అంటిపెట్టుకుని వుంది. ఇప్పుడు హిల్లరీ క్యాంపయిన్‌లో ఆమెది ప్రధాన పాత్ర.
హ్యూమా సలహా మేరకు బహరైన్ యువరాజు క్లింటన్ ఫౌండేషన్ వారి స్కాలర్‌షిప్ కార్యక్రమానికి 32 మిలియన్ డాలర్లు యిస్తానని మాట యిచ్చాడు. అంతేకాకుండా తన రాజ్యం నుంచి 50 వేల డాలర్లు బహుమతిగా యిస్తానన్నాడు. ఆ విరాళం ముట్టాక ఫౌండేషన్ యొక్క సహవ్యవస్థాపకుడు, క్లింటన్లకు మిత్రుడు అయిన డగ్లస్ బ్యాండ్ హిల్లరీకి ఈమెయిల్ రాశాడు - 'ఇతను మనకు మంచి మిత్రుడు, ఎపాయింట్‌మెంటు యివ్వగోర్తాను' అని. అపాయింట్‌మెంట్ దొరికింది. ఆ సందర్భంగా అమెరికా తరఫు నుండి బహరైన్‌కు ఆమె ఏ సాయం చేసిందో యింకా తెలియదు. మధ్యప్రాచ్య వ్యవహారాలు మాట్లాడుకున్నారు అని మాత్రమే బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు రాగానే తన పదవీకాలంలో హిల్లరీ కలిసిన ప్రభుత్వేతర వ్యక్తులెందరు, వారిలో ఫౌండేషన్‌కు విరాళాలు యిచ్చిన వారెవరు అని అసోసియేటెడ్ ప్రెస్ వారు కూపీ లాగారు. 154 మందిలో 85 మంది విరాళాలు యిచ్చినవారేట. ఇజ్రాయేలులో శాంతి నెలకొల్పడమే నా పరమాశయం అని చెప్పుకునే డేనియల్ అబ్రహాం, హిల్లరీ ఎన్నికల ప్రచారానికి, ఫౌండేషన్‌కు భూరి విరాళాలు యిస్తూనే వుంటాడు. ''వాళ్లంతా మా స్నేహితులు'' అని క్లింటన్లు చెప్పుకుంటూ వుంటారు. ఇలా డబ్బులు తీసుకుంటూనే హిల్లరీ ''ప్రజాస్వామ్యం డబ్బున్నవారి కోసమే కాదు, నేను రాజధానిలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను.'' అని చెప్పుకుంటూ వుంటుంది.
'ఇలా డబ్బు కోసం కోసం తన పదవిని వుపయోగించుకోవడం దేశద్రోహమే. ఇలాటామె దేశాధ్యక్షురాలైతే అమెరికాను విదేశీ శక్తులకు తాకట్టు పెట్టదా?' అంటాడు ట్రంప్. ఇది కాకతాళీయంగా జరిగింది తప్ప దీనిలో యిచ్చిపుచ్చుకోవడాలు లేవు అంటోంది క్లింటన్ ఫౌండేషన్. 'హిల్లరీ దేశాధ్యక్షురాలైతే ఫౌండేషన్‌కు విదేశీ విరాళాలను తిరస్కరిస్తాం' అంటున్నాడు బిల్ క్లింటన్. డగ్లస్ ఈ మెయిల్‌తో బాటు బయటకు వచ్చిన మరో ఈ మెయిల్ వలన తెలిసిందేమిటంటే - హిల్లరీ తను ప్రయివేటు సర్వర్ ద్వారా పంపిన ఈ మెయిళ్లన్నీ ఎఫ్‌బిఐకు అప్పగించలేదు! ఆ 15 వేల ఈ మెయిళ్లను సమీక్షించి, విడుదల చేయమని ఫెడరల్ కోర్టు గతవారమే స్టేట్ డిపార్టుమెంటును ఆదేశించింది.
తాజా వార్త ఏమిటంటే హిల్లరీకి, ఫౌండేషన్‌కు వారధిగా వుంటున్న హ్యూమా భర్త కారణంగా చిక్కుల్లో పడింది. ఆమె ఆంథోనీ వైనర్ అనే క్రైస్తవుణ్ని పెళ్లి చేసుకుంది. అతను డెమోక్రాటిక్ పార్టీ తరఫున 1999 నుండి 2011 దాకా కాంగ్రెస్‌మన్‌గా వున్నాడు. 2011లో తన స్నేహితురాలికి పంపిన అసభ్యకరమైన మెసేజి (సెక్స్‌టింగ్ అంటున్నారు) వెలుగులోకి రావడంతో రాజీనామా చేయవలసి వచ్చింది. అది కాస్త సద్దు మణిగి 2013లో న్యూయార్కు మేయరు పదవికి పోటీ చేస్తే అప్పుడు యింకోటి సెక్స్‌టింగ్ బయటపడి ఓడిపోయాడు. ఇప్పుడు హిల్లరీ ప్రచారం ఉధృతంగా సాగుతూండగా మొన్న ఆదివారం నాడు న్యూయార్కు పోస్టు 2015 జులైలో సాగిన మరో సెక్స్‌టింగ్ ప్రహసనాన్ని బయటపెట్టింది. ఇతను పంపిన అశ్లీలచిత్రాన్ని అందుకున్న యువతి దాన్ని పత్రిక వాళ్లతో పంచుకుంది. పత్రిక మార్కెట్లోకి రాగానే వివాదం చెలరేగింది. వెంటనే ట్రంప్ అందుకున్నాడు. ''హిల్లరీకి అతి సన్నిహితంగా వుండే హ్యూమా మతం ఏమిటో, ఆమె తల్లి ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తోందో పరికించండి. హ్యూమా భర్త తనపై తనకే నియంత్రణ లేని 'సిక్' ఫెలో. హిల్లరీ అధ్యక్షురాలైతే హ్యూమా వద్ద దేశభద్రతకు సంబంధించిన అనేక పేపర్లు వుంటాయి. భర్తగా ఆంథోనీకి అవి అందుబాటులో వుంటాయన్న విషయం తలచుకుంటేనే భయం వేస్తోంది.'' అన్నాడు. ఈ మాట అందరి మనసుల్లో నాటుకుంటుందనే భయంతో కాబోలు హ్యూమా వెంటనే తన భర్తకు విడాకులు యిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనల ప్రభావం హిల్లరీ క్యాంపెయిన్‌పై ఏ మేరకు వుంటుందో చూడాలి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి జోకేమిటంటే - అభ్యర్థులు ఎవరి గొప్ప వారు చెప్పుకోకుండా అవతలివాళ్లు ఎంత ప్రమాదకారులో చెప్పడంలో నిమగ్నమయ్యారని! మతిస్థిమితం లేని వ్యక్తి ట్రంప్ అని హిల్లరీ క్యాంప్ అంటే, హిల్లరీ నమ్మదగిన వ్యక్తి కాదని ట్రంప్ క్యాంప్ అంటోంది. చూడబోతే యిద్దరూ కరక్టే అనిపిస్తోంది.
- ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)