సౌతిండియా సినిమా పిచ్చోళ్లపై స్టార్ హీరో కామెంట్స్!

హిందీ జనాల మధ్యన బాహుబలి సినిమా ఎలా సక్సెస్ కాగలిగింది? బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాదిన ఎందుకు సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు? అనే అంశంపై ఆసక్తికరంగా స్పందించాడు బాలీవుడ్ ఎంపరర్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా ‘ట్యూబ్ లైట్’ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సల్లూ ఈ విషయాలపై స్పందించాడు.

బాహుబలి సినిమా ఇండియా లెవల్లో విజయం సాధించడాన్ని స్వాగతించాడు సల్మాన్ ఖాన్. మరి హిందీలో ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం.. అక్కడి ప్రేక్షకుల తీరే అని సల్లూ అభిప్రాయపడ్డాడు. బాహుబలి దక్షిణాది సినిమా నే అయినా, అందులోని హీరో, నటీనటులు, ఆ సినిమా దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు తమకు పరిచయం లేని వారే అయినా హిందీ భాష ప్రజలు ఆ బేధభావాలను పట్టించుకోలేని సల్మాన్ అన్నాడు.

సినిమాకు బాలీవుడ్ జనాలు సరిహద్దులు ఏర్పరుచుకోకపోవడం వల్లనే బాహుబలి హిందీ మాట్లాడే ప్రాంతాల్లో మంచి కలెక్షన్లను రాబట్టుకోగలిగిందని, రూరల్ నార్తిండియాలో కూడా ఆ సినిమా సక్సెస్ కు కారణం అదేనని సల్లూ అభిప్రాయపడ్డాడు. అయితే సినిమాల విషయంలో దక్షిణాది ప్రేక్షకుల తీరు వేరని సల్మాన్ విశ్లేషించాడు. ఇక్కడ హీరోల ఆరాధన చాలా ఎక్కువ అని సల్లూ వ్యాఖ్యానించాడు.

దక్షిణాది జనాలు ఒక హీరోకి అభిమానిగా మారితే, ఆ హీరోనే ఆరాధిస్తూ కూర్చుంటారని, మరో హీరో సినిమాను సామాన్యంగా పట్టించుకోరని సల్లూ అన్నాడు. హీరోలకు అభిమానులు చాలా చాలా లాయల్ గా ఉంటారని, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్.. అని అభిప్రాయపడ్డాడు.

‘కమల్ హాసన్ కు ఫ్యాన్ అయితే జీవితాంతం అలాగే ఉండిపోవడానికి ఫిక్సయిపోతారు, అదే రజనీకాంత్ ఫ్యాన్ అయితే ఆయనకే అంకితం అయిపోతారు.. ఉత్తరాదిన అలాంటి పరిస్థితి ఏమీ లేదు. దక్షిణాదిన మాత్రం ఫ్యాన్ క్లబ్ ను చేధించడం సాధ్యం కాదు..’ అని సల్లూ విశ్లేషించాడు.

ఉత్తరాదిన సంచలన విజయాలు సాధిస్తున్న తన సినిమాలు కానీ, షారూక్ సినిమాలు కానీ, మరే బాలీవుడ్ హీరో సినిమాలు కానీ... దక్షిణాదిన అనువాదం అయి కూడా ఆడకపోవడానికి ఈ కారణాలున్నాయని సల్మాన్ పేర్కొన్నాడు.

మరి సల్మాన్ విశ్లేషణ కొట్టి పడేయడానికి లేదు. దక్షిణాదిన హీరోల ఆరాధాన, కులాల వారీగా హీరోల ఫ్యాన్ క్లబ్ లు వంటి వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి.. సల్మాన్ అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. పెద్దగా లోతుల్లోకి వెళ్లకపోయినా..దక్షిణాది పరిస్థితి గురించి సల్మాన్ సులభంగానే అర్థం చేసుకున్నట్టున్నాడు.

Show comments