సరదాకి: అప్పనంగా ఎట్లొస్తరు.!

రాజకీయ పార్టీలన్నాక ఏదో ఒక హడావిడి చేయాలి. అధికారంలో వుంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఇంకోలా.. హడావిడి చేయక తప్పదు. అధికారంలో వున్నవారు, ప్రజల సొమ్ములతో మీటింగులు పెడితే, అధికారంలో లేనివారు సొంత ఖర్చులతో మీటింగులు పెడుతుంటారు. మరి, ఈ మీటింగులకు జనం రావాలి కదా.? జనం లేకుండా, నేతలే తమంతట తాము మాట్లాడేసుకుని, వెళ్ళిపోరు కదా.! కాబట్టి, జనాన్ని తీసుకురావాలి. తప్పదు. 

ఒకప్పుడు రాజకీయ పార్టీల వెంట ప్రజలుండేవారు.. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల్ని తీసుకొస్తున్నాయి. రోడ్‌ షో అనండీ, బహిరంగ సభ అనండీ, ఇంకోటనండీ.. ఏ రాజకీయ పార్టీ కార్యక్రమానికైనా ఇప్పుడు జనాన్ని తీసుకురవాల్సిందే. నిజం ఎప్పుడూ నిష్టూరమే. ప్రజల్ని, రాజకీయ కూలీలుగా రాజకీయ పార్టీలు మార్చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. 

నిన్న విశాఖలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకి కోట్లు ఖర్చయ్యాయన్నది టీడీపీ ఆరోపణ. ఖర్చు పెట్టకుండా రాజకీయ పార్టీలు ఏదన్నా కార్యక్రమం చేయగలవా.? ఛాన్సే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కోసం కుప్పలు తెప్పలుగా ఈవెంట్లు చేసేశారు. జనం వాటన్నిటికీ స్వచ్ఛందంగానే వచ్చారా.? బలవంతంగా లాక్కురాలేదా.! అంతెందుకు, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని అమరావతికి తీసుకొచ్చిన చంద్రబాబు, అక్కడ హంగామా చేయడానికి పెద్దయెత్తున డబ్బు వెదజల్లారు. అది ప్రభుత్వ కార్యక్రమం. అందుకే ఖర్చులో చాలావరకు ప్రభుత్వ ఖజానా నుంచే లాగేశారు. 

చంద్రబాబు, వీలు చిక్కినప్పుడల్లా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో. వీటికి అవుతున్న ఖర్చుల లెక్కల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందా.? వుండదుగాక వుండదు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు ఎడా పెడా శ్వేత పత్రాలు విడుదల చేసేశారు. తన ఖర్చులపైనా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తే బావుండేదేమో.! 

వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో వున్నారు.. ఒకవేళ ఆయన బహిరంగ సభలకి కోట్లే ఖర్చు చేశారనుకుందాం.. అది ఆయన వ్యక్తిగతం. అయినా, ఖర్చు చేసే డబ్బు.. బహిరంగ సభలకు వచ్చే జనం.. ఇవే ఓట్లను రాబడ్తాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. పైగా, ఓ పక్క ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దుర్వినియోగం చేస్తూ, ప్రతిపక్ష నేత బహిరంగ సభలకు కోట్లు ఖర్చు చేస్తారనడాన్ని ఏమనుకోవాలి.?

Show comments