అస్సలు మాట్లాడని వెంకీ కూడా మైక్ అందుకున్నాడోచ్..

తన సినిమా ఫంక్షన్లు లేదా మిగతా కార్యక్రమాల్లో వెంకటేశ్ మాట్లాడ్డం ఎప్పుడైనా చూశారా.. ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడేసి మమ అనిపిస్తాడు. తనకు పెద్దగా మాట్లాడ్డం రాదంటూ ఓ కామన్ డైలాగ్ కూడా చెప్పేస్తాడు. ఇలా మాట్లాడ్డానికే ఇబ్బందిపడే విక్టరీ ఇప్పుడు ఏకంగా పాట పాడేశాడు. అవును.. విక్టరీ వెంకటేశ్ కాస్తా, సింగల్ వెంకీగా మారిపోయాడట.

సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతున్న గురు సినిమాలో వెంకటేశ్ ఓ పాట పాడాడట. సినిమాకు అదే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నాడు మ్యూజిక్ డైరక్టర్ సంతోష్ నారాయణన్. తను కంపోజ్ చేసిన ట్యూన్ కు వెంకీ వాయిస్ అతికినట్టు సరిపోయిందని ఈ సంగీత దర్శకుడు తెగ ముచ్చటపడిపోతున్నాడు. సుధా కొంగర డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల్లోనే థియేటర్లలోకి రావాల్సింది. కానీ ఏప్రిల్ కు వాయిదాపడింది.

స్టార్ హీరోలు పాటలు పాడడం టాలీవుడ్ లో కొత్తేంకాదు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్.. ఇలా చాలామంది గొంతు సవరించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పాతికేళ్లకు పైగా సినీ అనుభవం ఉన్న వెంకీ కూడా చేరడం దగ్గుబాటి అభిమానుల్లో ఆనందం నింపింది.

Show comments