మీడియాపై నిషేధం.. తప్పా.? ఒప్పా.?

దేశంలో మీడియాపై ఉక్కుపాదం మోపడం పాలకులకు సర్వసాధారణమైపోయింది. అదే సమయంలో, మీడియా నైతిక విలువలకు తిలోదకాలిచ్చేయడమూ అంతే సాధారణ విషయంగా మారిపోయింది. కొన్ని విషయాల్లో మీడియా 'అతి'ని కాదనలేం. అదే సమయంలో, రాజకీయ పార్టీలు.. తమ రాజకీయ అవసరాల కోసం మీడియాపై పెత్తనం చేయడాన్నీ తప్పుపట్టకుండా వుండలేం. 

ఎవరిది తప్పు.? అనంటే, ఖచ్చితంగా పాలకులదే తప్పు.. అని మీడియాపై ఉక్కుపాదం విషయంలో చెప్పక తప్పదు. పోటీ పెరిగిపోయింది. ఈ పోటీని తట్టుకోవడానికి మీడియా సరికొత్త పుంతలు తొక్కాల్సి వస్తోంది. అదే సమయంలో, మీడియాపై రాజకీయ ప్రాబల్యం ఎక్కువైపోయింది. ఫలానా పార్టీకి ఫలానా ఛానల్‌, పత్రిక చాలా సాధారణ విషయంగా మారిందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే, అన్ని రాజకీయ పార్టీలకీ, ఛానళ్ళు పత్రికలు వున్నాయి. కొన్ని అధికారికం, కొన్ని అనధికారికం.. అంతే తేడా. 

తెలంగాణలో రెండు ఛానళ్ళపై అప్పట్లో బ్యాన్‌ కొనసాగింది. అది అధికారిక బ్యాన్‌.. అయినా, అనధికారిక బ్యాన్‌లా కొనసాగింది. పోరు జరిగీ జరిగీ.. ఇద్దరికీ విసుగొచ్చేసింది. ఆ తర్వాత ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం. 'తెలంగాణ మనోభావాల్ని దెబ్బతీశారు..' అంటూ, అధికార పార్టీ ఆ ఛానల్స్‌పై కత్తికట్టిన మాట వాస్తవం. అలా కత్తికట్టారు బాగానే వుంది, ఆ మీడియా సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయగలిగారా.? లేదే.! చేతకాలేదు, చేతులెత్తేశారు. 

ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీటీవీ ఛానల్‌పై ఒక రోజు నిషేధం విధించింది కేంద్రం. దానికి బలమైన కారణమే వుంది. ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి జరిపారు. దాన్ని లైవ్‌ కవరేజ్‌ ఇచ్చింది ఎన్డీటీవీ. అంతే, కేంద్రం గుస్సా అయ్యింది. ఇలాంటి ఆపరేషన్ల విషయంలో గోప్యత అవసరం. కానీ, 'పోటీ' నేపథ్యంలో చాలా ఛానళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కానీ, శిక్ష మాత్రం ఎన్డీటీవీకే పడింది. 

ఎక్కడన్నా ఏ చిన్న ఘటన జరిగితే చాలు, మీడియా అక్కడ వాలిపోతోంది. దాన్ని నియంత్రించడం ఎవరితరమూ కాదు. ఈ విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్న మాట వాస్తవం. అదే సమయంలో, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లోకీ వెళ్ళి, అతి ముఖ్యమైన సమాచారాన్ని చేరవేస్తోంది ఎలక్ట్రానిక్‌ మీడియా. ఇది చాలా సందర్భాల్లో పోలీసులకు ఉపకరిస్తోంది కూడా. ఇలాంటి సందర్భాల్లోనే పొరపాట్లు చోటుచేసుకున్నప్పుడు హెచ్చరికలతో సరిపెడితే సమస్య తీరిపోతుంది. 

ఒక రోజు సస్పెన్షన్‌తో ఒరిగేదేంటి.? జస్ట్‌ టెక్నికల్‌ సమస్య.. అని సరిపెట్టుకోవచ్చు. అదే హెచ్చరిక ఇచ్చి ఊరుకుంటే, కేంద్రానికీ గౌరవం పెరిగేదే. కానీ, ఇక్కడ అలా జరగలేదు. నిషేధం ఎత్తివేతకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయనే ఆశిస్తున్నారంతా. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

Show comments