పల్స్ సర్వే: టీడీపీ కొత్త నాటకం

బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి 130 సీట్లు వస్తాయి.. అదే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే, టీడీపీకే 140 సీట్లు వస్తాయి. ఇది, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు వున్న పరిస్థితి. వినడానికి ఎంత కామెడీగానో వుంది కదా.! 

2014 ఎన్నికల్లో టీడీపీకి అధికారం ఎందుకు దక్కింది.? అని చిన్న పిల్లాడినడిగినా లెక్కలు చెబుతాడు. బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తోంది గనుక, ప్రత్యేక హోదా తీసుకురావడం ఖాయం అనీ, టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి అద్భుతమైన రాజధానిని నిర్మించగలరనీ, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ బాగుపడ్తుందనీ.. ఇలా సవాలక్ష ఆలోచనలతో చంద్రబాబుని గద్దెనెక్కించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం. ఈ క్రమంలో టీడీపీ - బీజేపీలకు పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ కూడా ప్లస్‌ అయిన మాట వాస్తవం. 

కానీ, చిత్రంగా ఇప్పుడు బీజేపీతో - టీడీపీ కలిస్తే ఓ పది సీట్లు తక్కువ వస్తాయట.. టీడీపీ విడిగా పోటీ చేస్తే ఇంకో పది ఎక్కువ వస్తాయట. ఏం చేసినా, వైఎస్సార్సీపీ మాత్రం అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు, తన ఉనికిని చాటుకోవడమే కష్టమట. ఇదీ టీడీపీ అనుకూల మీడియా చేయించిన సర్వే ఫలితం. అద్గదీ అసలు విషయం. 130, 140 దగ్గర ఎందుకు ఆపేశారో.. 175 వేసేసుకుని వుంటే బావుండేది కదూ.! ఇంకా నయ్యం.. అలా చేస్తే విశ్వసనీయత ఏముంటుందట.! ఆగండాగండీ, విశ్వసనీయత అనేదొకటి ఏడిస్తే కదా.! 

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా కీలకమైన అంశమే కాబోతోంది. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రత్యేక హోదాని చెల్లని కాగితంగా పోల్చినాసరే, 2019 ఎన్నికల్లో అదే కీలకమైన అంశం. రాజకీయ నాయకులు, పార్టీలూ అన్నీ మర్చిపోవడం మామూలే. ప్రజలు మాత్రం దేని లెక్క దానికి చెప్పకుండా వదలరు. ఇది వాస్తవం. ప్రత్యేక హోదా అంశం కీలకమైతే కాంగ్రెస్‌ తరహాలో బీజేపీకి పనిష్మెంట్‌ మామూలే. బీజేపీతో అంటకాగిన టీడీపీకి కూడా ఓటర్లు తగిన శాస్తి చెయ్యకుండా వుంటారా.? ఇది మినిమమ్‌ లాజిక్‌. 

2019 ఎన్నికల దాకా కాదు, ఇప్పటికిప్పుడు.. అని అంటున్నారు గనుక, వేడి ఇంకా తీవ్రంగా వుంటుంది. రిజర్వేషన్ల పేరుతో కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టినందుకు, ఆ సామాజిక వర్గం నుంచి మరో కఠినమైన శిక్షను టీడీపీ ఎదుర్కోక తప్పదు. ఏదీ రాజధాని.? ఏదీ పోలవరం ప్రాజెక్టు.? ఏదీ రైల్వే జోన్‌.? ఇలా ప్రశ్నలు చాలానే వున్నాయి.. దేనికీ సమాధానం లేదు. మరెలా, టీడీపీకి 140 సీట్లు వస్తాయట.? 

ఒక్కటి మాత్రం క్లియర్‌ టీడీపీ - బీజేపీ విడిపోతే.. టీడీపీకే లాభం.. అన్న అంచనాలతోనే ఈ సర్వే రూపొందింది. మసిపూసి... అన్న చందాన, టీడీపీ - బీజేపీ మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ సర్వే తెరపైకొచ్చింది. దానికి, ప్రజల నాడి.. అంటూ నిస్సిగ్గుగా పేర్లు పెట్టేయడం శోచనీయం.

Show comments