దేశ రాజకీయాల్లో యువతరం మరో సారి కీలక పాత్రపోషించనుంది. ఉత్తరప్రదేశ్ లో తండ్రి నీడనుంచి బయటపడ్డ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ జాతీయ రాజకీయాల్లో సైతం, మోడీని సైతం ఢీకొనే అవకాశాలున్నాయి. ఇంతకాలం ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న తతంగాన్ని కేవలం కుటుంబ రాజకీయాలేనని కొట్టిపారేసిన భారతీయ జనతా పార్టీ ఐ తే సమాజ్ వాది పార్టీలో యువనేత, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ పై తిరుగుబాటు చేసి నాయకుడుగా ఎదిగిన వైనం చూసి దిగ్భ్రాంతి చెందింది. గత మూడు దశాబ్దాలుగా యుపి రాజకీయాలు సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అయితే అంతకుముందే తుడిచిపెట్టుకుపోయింది.
ఆ తర్వాత ములాయం, మాయావతి చుట్టే యుపి రాజకీయాలు పరిభ్రమించాయి. 1992లో బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత బిజెపి కూడా యుపిలో అధికారంలో రాలేని పరిస్థితి వచ్చింది. మళ్లీ నరేంద్రమోడీ పుణ్యమా అని 2014లో బిజెపి ఉత్తరప్రదేశ్ లో మళ్లీ విజృంభించి అత్యధిక స్థాయిలో లోక్ సభ స్థానాలు సంపాదించడంతో ఎస్ పి, బిఎస్ పి ఆత్మరక్షణలో పడ్డాయి. రెండు పార్టీలు మళ్లీ తమ రాజకీయాలు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. న్యాయంగా అయితే గత అయిదేళ్లుగా సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత బహుజన సమాజ్ పార్టీకి లభించాలి. కాని నరేంద్రమోడీ జాతీయ స్థాయిలో రంగంలోకి వచ్చిన తర్వాత మాయావతి ఓట్ బ్యాంకులో ప్రముఖ పాత్ర వహించిన అగ్రవర్గాలు బిజెపి వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. అదే సమయంలో ములాయం ఓట్ బ్యాంక్ అయిన బీసిలను కూడా బిజెపి చీల్చగలిగింది. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న నేర సామ్రాజ్యం, మాఫియా పాలన మూలంగా యువకుడైనప్పటికీ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ రాజకీయంగా రావాల్సిన ప్రతిష్ట సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు బిజెపికే అనుకూలంగా మారే పరిస్థితి ఏర్పడింది.
సరిగ్గా ఇదే సమయంలో సమాజ్ వాది పార్టీ సుప్రీం, కురువద్ద నేత ములాయం సింగ్ యాదవ్ చక్రం తిప్పాడు. ఎలాగూ తాను తిరిగి అధికారంలోకి రాలేనని, కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించలేనని ఆయన గ్రహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఆయన చక్రం తిప్పలేని స్థితికి వచ్చాడు. అంతేకాక ములాయం చుట్టూ కుటుంబ నేతలు, నేరచరితులు గుమి గూడి ఆయననొక అసమర్థ నేతగా చిత్రించారు. ఈ సమయంలో ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కు పట్టం కట్టడానికి రాజకీయాలు అల్లాడు. గతంలో జనతా పార్టీ చీలిన తర్వాత ఒక సమాజ్ వాది పేరుతో ఒక కొత్త పార్టీ ఏర్పర్చి మొత్తం యుపిలో బిసిలు, ముస్లింలందర్నీ తన వైపుకు తిప్పుకున్న ములాయం సింగ్ ఈసారి కుమారుడు పేరుతో కొత్త రాజకీయాలకు తెరతీశాడు. మరో వైపు లాలూ కూడా ఇదే రాజకీయాలు అవలంబించి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని ఏర్పరిచాడు. కాని ఇద్దరూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించారు. కుటుంబ రాజకీయాలను అడ్డంగా ప్రోత్సహించారు.
ఈ సారి చరిత్ర పునరావృతమయ్యే పరిస్థితి ఏర్పడింది. ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ లాగా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించదలిచి 2012లో సమాజ్ వాది పార్టీ గెలిచిన తర్వాత తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ కు పట్టం కట్టారు. కాని 2014లో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కలలను నరేంద్రమోడీ భగ్నం చేశాడు. మరో వైపు యుపిలో కుళ్లు రాజకీయాల పుణ్యమా అని తన కుమారుడు అఖిలేష్ యాదవ్ భవిష్యత్ కూడా తెరమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆయన పావులు కదిపి తనపైనే కుమారుడు తిరుగుబాటు చేసేలా పరిస్థితిని మలిచాడు. తన సోదరుడు శివపాల్ యాదవ్, తన రెండో భార్య, ములాయం వెనుక నీడలా చేరిన అమర్ సింగ్ కలిసి యుపి రాజకీయాలను గుప్పిట్లో తెచ్చుకుని తన మొదటి భార్య కుమారుడు అఖిలేశ్ యాదవ్ కుర్చీ క్రిందకే నీళ్లు తేవాలని ప్రయత్నించడం, ముఖ్యమంత్రి పదవిని కబళించాలని చూడడం గమనించిన ములాయం సింగ్ యాదవ్ లో వద్ద సింహం నిద్రలేచింది.
అఖిలేష్ రాజకీయ భవిష్యత్తు సుదీర్ఘంగా, సుస్థిరంగా సాగాలంటే అతడు తండ్రిపైనే తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితిని కల్పించాడు. ఒకవైపు భార్య, సోదరుడు, అమర్ సింగ్ ల మాట వింటున్నట్లు నటిస్తూనే అఖిలేశ్ ను తన నిజమైన రాజకీయ వారసుడుగా మలిచాడు. మరో వైపు విద్యాధికుడు అయిన అఖిలేశ్ ఓటర్లను మచ్చిక చేసుకునే పథకాల ద్వారా జనానికి దగ్గరయ్యేందుకు, సంస్థలో అత్యధికులు తన వైపు మొగ్గు చూపేందుకు తగిన వాతావరణం కల్పించాడు. పార్టీలో అత్యధికులు అఖిలేశ్ యాదవ్ వైపు మొగ్గు చూపేవరకూ ములాయం వేచి చూశాడు. యువకులంతా అఖిలేష్ వైపు మళ్లేందుకు తగిన వాతావరణం ఏర్పరిచాడు. మరో వైపు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీతో అఖిలేశ్ ను చేతులు కలిపేందుకు ప్రోత్సహించాడు. దీనితో జాతీయ స్థాయిలో కూడా మోడీకి వ్యతిరేకంగా రాహుల్, అఖిలేశ్ కూటమి బలపడేందుకు ఆస్కారం కలిగింది. 1969లో పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తిరుగుబాటు చేసి పార్టీని చీల్చి చివరకు విజయవంతం అయినట్లే అఖిలేశ్ కూడా తనపైనే తిరుగుబాటు చేసేందుకు ములాయం వ్యూహ రచన చేశాడని చెప్పక తప్పదు.
ఏమైతేనేం ఒక తిరుగుబాటు నాయకుడుగా యువకుల స్వప్నాలకు ప్రతీకగా యుపి రాజకీయాల్లో అఖిలేశ్ అవతరించాడు. ఇప్పటికే అతడు పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తగిన విధంగా సన్నద్దమయ్యాడు. టీవీ, వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేసేందుకు ఆయన ఆరునెలలనుంచే రంగాన్ని సిద్దం చేశాడు. నిజానికి నాలుగు నెలలముందు సమాజ్ వాది పార్టీలో శివపాల్ సింగ్ దే పై చేయి. అప్పుడు వంద ఎమ్మెల్యేలు శివపాల్ తో ఉన్నారు. ఇప్పుడు శివపాల్ తో కేవలం ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. 2016 సెప్టెంబర్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయం తన కుమారుడు అఖిలేశ్ ను తొలగించే సమయానికి శివపాల్ బలమే ఎక్కువ. నవంబర్ లో సమాజ్ వాది పార్టీ రజతోత్సవాల సమయంలో శివపాల్ అఖిలేశ్ నుంచే మైకు లాక్కొని ముఖ్యమంత్రినే అబద్దాల కోరుగా అభివర్ణించాడు.
ఆ సమయంలో ములాయం కనుక తన కుమారుడికి మద్దతు పలికినట్లయితే శివపాల్ పార్టీనే చీల్చేవాడు. తన కుమారుడిని సోదరుడు అవమానించినా ములాయం ఊరుకుండి పోయాడు. కుమారుడినే ఆయన విమర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది. క్రమంగా అఖిలేశ్ కు మద్దతు పెరిగేంతవరకూ ఆయన ఊరుకుండిపోయాడు. కుటుంబంలోనూ, బయటా అఖిలేశ్ కు మద్దతు పెరగడం, మెజారిటీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అతడిని బహిరంగంగా సమర్థించడంతో పాటు బిజెపి యేతర పార్టీలన్నీ అఖిలేశ్ కు మద్దతుగా నిలిచేంతవరకూ ఓపికగా ఊరుకున్నాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జెడి నేత అజిత్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ తన కుమారుడికి మద్దతు నిలిచేందుకు ములాయం తెర వెనుక చక్రం తిప్పాడు. ఆ తర్వాత తననుంచి సుపుత్రుడే పార్టీని హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పించాడు.
ఏదైతేనేం అఖిలేశ్ గుప్పిట్లో సమాజ్ వాది పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ సైకిల్ గుర్తు అఖిలేశ్ కు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ గుర్తును స్తంభించినా, యుపి రాజకీయాల్లో అఖిలేశ్ తిరుగులేని నాయకుడుగా మిగిలాడు. ఢిల్లీ స్థాయిలో ఇదంతా నాటకమని బిజెపి నేతలు చూసూ ్తఊరుకున్నా అఖిలేశ్ వేగంగా ముందుకు వచ్చిన తీరు చూసి దిగ్భ్రాంతులు కాక తప్పలేదు. ఎన్నికల షెఢ్యూలును ఆగమేఘాలతో ప్రకటించినప్పటికీ అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది. రాజకీయాలు ఆడడం ఎప్పుడూ ఒకరికే సాధ్యం కాదని, ములాయం నిరూపించాడు. యుపి పరిణామాలతో 2019 ఎన్నికల్లో మోడీకి ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసేందుకు దారితీసే సంకేతాలు కనపడుతున్నాయి.