మన్మోహన్ కన్నా.. లోకేష్ గొప్పవాడా..!

అవును.. అది తెలుగుదేశం పార్టీ.. ఎప్పుడు ఎలాంటి మాటలైనా మాట్లాడగలదు. ఆంధ్రాలో సమైక్యవాదాన్ని, తెలంగాణలో ప్రత్యేక వాదాన్ని వినిపించగలడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అంతేనా.. తెలంగాణలో ఫిరాయింపుదారులకు మంత్రి పదవిని ఇచ్చారంటూ నోరు కొట్టుకుంటూ, ఈ విషయంలో గవర్నర్ ను కూడా విమర్శిస్తూ, అదే గవర్నర్  చేత ఏపీలో అలాంటి ఫిరాయింపుదారులను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేంత టాలెంట్ కూడా తెలుగుదేశం అధినేతకు ఉంది! ఇన్ని చేస్తూ కూడా తను ‘నిప్పు’ ను అని చెప్పుకోవడం కూడా బాబుకు ఉన్న మాస్టర్ డిగ్రీ పనితనం!

మరి ఇలా చెప్పుకొంటూ పోతే.. చంద్రన్న మాట మార్పిడిల వ్యవహారానికి ఒక హద్దూపద్దూ ఉండదు! ఏ వ్యవహారాల్లో అయితే ఈయన తన ప్రత్యర్థులను విమర్శిస్తాడో.. అలాంటి పనులే చేయడం చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పుడు లోకేష్ బాబుకు మంత్రి పదవి ఇస్తున్న వైనాన్ని గమనిస్తే వెనుకటికి చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు గుర్తుకు రాకమానవు.

వెనుకటికి.. యూపీఏ హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై బాబు చాలా అనుచితమైన మాటలు మాట్లాడే వారు. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పిన ఆర్థిక మంత్రిగా పేరున్న మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా.. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యి.. పదవిని చేపట్టడంపై బాబు లెక్కలేనన్ని సార్లు విమర్శలు చేశారు. ఆ పది సంవత్సరాల్లో కొన్ని వందల సార్లు మన్మోహన్ సింగ్ ‘దొడ్డిదారిన’ ప్రధానమంత్రి అయ్యాడు.. అని బాబుగారు వ్యాఖ్యానించారు.

మన్మోహన్ సింగ్ రాజకీయ నేత కాదు.. ఆయన అంటే ఏమిటో, ఆయన నేపథ్యమే చెబుతుంది. ఇక రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉండి.. ప్రధాన మంత్రి పదవిని చేపట్టడానికి రాజ్యాంగం అనుమతి ఉంది. అయితే బాబుగారికి మాత్రం.. మన్మోహన్ సింగ్ పై కోపం. అందుకే.. ఆయన ‘దొడ్డిదారిన ప్రధానమంత్రి’ అయ్యాడు అని పదే పదే విమర్శలు చేసేవాడు. తనేం మాట్లాడుతున్నానో కూడా బాబుగారికి అప్పట్లో అవగాహన ఉండిందో లేదో కానీ, ఇప్పుడు సొంత తనయుడిని అదే ‘దొడ్డిదారిన’ మంత్రిగా చేస్తున్నారిప్పుడు చంద్రబాబు!

లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి.. మంత్రి అయిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచే ఈ ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఇదేం లెక్క? మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని, దార్శానికుడిని.. సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులెత్తించిన వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన స్థాయి ఏమిటో కూడా గమనించకుండా.. ‘దొడ్డిదారి’ అంటూ భారత రాజ్యాంగాన్నే అవమానించారు. మరి ఇప్పుడు వీరు దేన్నైతే ‘దొడ్డిదారి’ అన్నారో.. అదే దారిన తనయుడిని మంత్రిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు!

మరి ఇదీ బాబుగారి తెలివితేటలు. తను చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం! ఒక్క విషయంలో అయితే.. ఏదోలే అనుకోవచ్చు… ప్రతి విషయంలోనూ ఇలానేనా!  

Show comments