ఇక్కడ హెరిటేజ్.. అక్కడ రాందేవ్!

దాచుకోవడం ఏమీ లేదు.. దారుణాలు అన్నీ నిర్భీతిగా జరిగిపోవడమే. ప్రభుత్వ సొ్మ్మును డైరెక్టుగా దోచుకునే అవకాశాలను విస్తృతంగా ఉపయోగించుకోవడమే. ఆ మధ్య ఏపీలో.. మజ్జిగ పంపీణీ వ్యవహారం లో “హెరిటేజ్ ‘’ స్టోర్ల వ్యాపారానికి ఊపునిచ్చే ప్రయత్నాలు బహిర్గతం అయ్యాయి. జనాలు ఎండలు తట్టుకోలేకపోతున్నారు.. వారికి మజ్జిగ పంచి కూల్ చేయాలన్న బృహత్తర ఐడియా ఏపీ క్యాబినెట్ కు రాగా, ఆ మజ్జిగను హెరిటేజ్ ఫ్రెష్ నుంచి మాత్రమే కొంటే.. పాలూ, కూరగాయాలు అమ్ముతూ కష్టాల్లో ఉన్న సీఎం కుటుంబానికి కొంత ఊరటను ఇచ్చినట్టుగా ఉంటుందని అధికారులు భావించారు. ఇంకేముంది.. అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 

‘హెరిటేజ్’ నుంచి మాత్రమే కొనాలి .. అని అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా, ఆ మజ్జిగ పంపిణీ పథకం ప్రజల కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో, తెలుగుదేశం అధినేత కుటుంబ వ్యాపారాల కోసమో చెప్పకనే చెప్పారు!

ఈ సారి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాన్నే తీసుకుంది. అదేమంటే.. దారిద్ర రేఖ దిగువన ఉండే ప్రజలకు ఇచ్చే రేషన్ సరుకుల్లో బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ప్రోడక్ట్స్ ను మిళితం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  ఈ  విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించాడు.

రేషన్ షాపుల్లో తిండి గింజలు మాత్రమే గాక.. సబ్బులు, షాంపూలు, నూనెలు తదితరాలు.. ఇంకా చెప్పాలంటే, పతంజలి వారు ఏమేం అమ్ముతారో.. వాటన్నింటినీ అందుబాటులో పెట్టనున్నామని  చౌహాన్ వివరించాడు. ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తామని ఆయన ప్రకటించాడు!

మరి.. దీన్ని ఏమనాలి? ఇక్కడ  కొందరు మహానుభావులు, పతంజలి ప్రోడక్ట్స్ బాగుంటాయి, వాటిని రేషన్ ద్వారా ప్రజలకు ఇస్తే తప్పేముంది? అనే బీభత్సమైన మేధోతనాన్ని ప్రదర్శించవచ్చు. కానీ… వాటిని అమ్ముకోవడానికి పతంజలి స్టోర్స్ ఉన్నాయి.  కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు అవి అందుబాటులోకి తీసుకురావడానికి.. సూటిగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది కాబోలు! రూరల్ ఏరియాల్లో పతంజలి స్టోర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కొట్లు, సిబ్బంది అవసరం లేకుండా.. ప్రభుత్వమే రేషన్ షాపుల ద్వారా మార్కెటింగ్ చేయాలని ఫిక్సయ్యింది. 

 కమలం పార్టీ నేతలకు, రాం దేవ్ బాబా కు ఉన్న అనుబంధం ఏమిటో వేరే వివరించనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ను ఏలుతున్న బీజేపీ నేతలు.. రాందేవ్ బాబా సరుకులను జాతీయం చేసి, వాటికి రేషన్ షాపుల ద్వారా మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తున్నారు. మొత్తానికి దేశం ఆ విధంగా ముందుకుపోతోంది!

Show comments