పాపం జైరామ్ కు ఏమీ తెలియదు

ఆంధ్రప్రదేశ్ విభజనలో అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పాత్ర ఎంతో తెలుగురాష్ట్రాల్లో ఆ మాత్రం ఈమాత్రం పాలిటిక్స్ వచ్చిన ఎవరిని అడిగినా చెబుతారు.  కాని జైరామ్ రమేష్ మాత్రం అమ్మతోడు తనకా విషయమే తెలియందంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఏపీ విభజనపై ఆయన ఏకంగా ఓల్డ్ హిస్టరీ న్యూ జియాగ్రఫీ అనే పుస్తకం రాసేసారు. అందులో కాంగ్రెస్ ను ఎంత బదనామ్ చేయాలో అంతా వుంది. ఇంకేమి, తెలుగుదేశం విభజన లేఖ ఇచ్చిన వైనాన్ని మరింత దాచేందుకు వీలుగా, ఈ పుస్తకంలోని అంశాలను పదే పదే అచ్చేసి వదుల్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా. 

ఈపుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారిలో సాక్షి రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి  కె.శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ కోదండరాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సదరు పుస్తకంలో తెలంగాణకు అంత వేగంగా చివరి క్షణంలో ఎందుకు విభజించారు, దీనికి సహేతుక కారణాలున్నాయా,  ఈ విషయంలో కాంగ్రెస్ ముఖ్యుల మధ్య జరిగిన పరిణామాలేంటి, డిసెంబరు 9న చిదంబరం ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు వెనక్కు తగ్గారు ఇలా ఎన్నో ఎన్నెన్నో అసలుసిసలైన అంశాలు లేవని, ఆరహస్యాలే ఇప్పుడు తెలుగువారు తెలుసుకోవాల్సిన అసలు విషయాలని ప్రశ్నలు సంధించారు హాజరైన ప్రముఖులు. 

పోలవరం వద్దని అనుమతులను పర్యావరణ మంత్రిగా నిలిపివేసిన జైరాంరమేషే జీఓఎంలో పోలవరమే ఏపీకి ఆక్సీజన్ లాంటిదని దానిని ఎందుకు చేర్చారో కూడా చెప్పాలన్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరయిన జైరాంరమేష్ ఏపీ విభజన ఎందుకు జరిగిందో తనకు నిజంగా తెలియదన్నారు. జీఓఎం ఏర్పాటు చేసి దాని బాధ్యతలు తనకు అప్పగించాక అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే ఆ పనిచేసుకుపోయానన్నారు. పోలవరానికి పర్యావరణ అనుమతులు లేనందున ఆపి వేశానని, అయితే తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో, ఏపీకి పోలవరం అలాంటిదన్నారు. ఎలాగు విభజన తప్పదని అందరికి తెలుసన్నారు. 

కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పుడే నిజమైన విభజన జరిందని ఇది అందరికి తెలుసన్నారు. అలాంటప్పుడు ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను కాపాడుకునే విధంగా సీమాంద్ర నేతలు ఎందుకు ప్రయత్నించలేదన్నదానికి ఆయన సమాధానం చెప్పలేదు. పార్లమెంటులో ఆమోదించిన తర్వాత కూడా కేంద్రమంత్రులు గుడ్డిగా విభజన జరగదు, దానిని నిలవరిస్తాం అంటూ అదే పనిగా విభజన వద్దంటూ మాట్లాడారే తప్ప ఏపీకి ఇవి కావాలని పట్టుపట్టకపోవడం వారి మూర్ఖత్వమే కదా. 

కాంగ్రెస్ వారే కాదు ఇటు చంద్రబాబు, జగన్ వంటి వారికి కూడా కళ్లముందే విభజన జరిగిపోతున్నా.. వారు కూడా విభజన కానివ్వం అంటూ తిరిగారే తప్ప ఏపీ ప్రయోజనాల విషయంలో పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు లోపభూయిస్టంగా, ఏపీకి నష్టం కలిగే విధంగా విభజన జరిగింది. విభజన జరిగాక కూడా అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు చేసి పంపించడం ఆయన వెర్రతనమా.. ఇలా ఎన్నో విషయాలు జనాలకు తెలియాలన్నారు. అయితే ఒక్కటి మాత్రం జైరాంరమేష్ స్పష్టం చేశారు. ఏపీ నేతలంగా ఎందుకు అలా చేశారో నిజంగా విస్మయం కలిగించే విషయమే. 

విభజన ఆగదని అందరికి తెలిసినా ఏపీ ప్రయోజనాల కోసము ఎవ్వరూ ప్రయత్నించలేదన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసిందని కొందరు, కాదుకాదు హామీలిచ్చి చంద్రబాబు, బిజేపీనే అన్యాయం చేసిందని మరి కొందరు నెత్తి నోరు బాదుకుంటున్నదంతా నాటకమే. అందరు కలిసి అన్యాయం చేశారన్నది అర్థం అవుతోంది. అయితే ఇంకా దాగి ఉన్న పచ్చి నిజాలెన్నో త్వరలో తాను రాసే పుస్తకంలో వస్తున్నాయని మరో కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి ఈ సంధర్భంగా స్పష్టం చేశారు. అంటే మరిన్ని సంచలాత్మక విషయాలు త్వరలోనే తెలియనున్నాయన్నమాట. జైరామ్ రమేష్ బయటపెట్టింది అరకొర విషయాలే. అసలు విషయాలన్నీ ఉండవల్లి పుస్తకంతో బయటకు వస్తాయేమో? చిత్రమేమిటంటే జైరామ్ రమేష్ కూడా ఇలాగే అభిప్రాయపడడం. ఇక ఆ పుస్తకం ఎప్పుడు బయటకు వస్తుందో ?

Show comments