'ఈవెంట్‌ మేనేజర్‌' నుంచి 'సేల్స్‌మేన్‌' దాకా...

తన మూలాలు పొదిగి ఉన్న సేద్యపు జీవితం మీద వైమనస్యం ఏర్పడేదో... కార్పొరేట్‌ ఉద్యోగాలు చేయాలంటూ చదువుకునే రోజుల్లో ఎన్నడైనా కలలు కనేవాడో ఏమో కానీ.. ఎమ్మే ఎకనామిక్స్‌ చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనను తాను 'ముఖ్యమంత్రి' అనే డిజిగ్నేషన్‌ తో కంటె, 'సీఈవో ఆఫ్‌ ఏపీ' అనే డిజిగ్నేషన్‌ తో గుర్తించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సంగతిని ఆయన గతంలో తొమ్మిదేళ్ల అప్రతిహత పరిపాలన సాగించిన రోజుల్లో పలుమార్లు నిరూపించుకున్నారు. అంతెందుకు ఆ పరిపాలన రోజుల్లో తన గురించి 'సీఈవో ఆఫ్‌ ఏపీ' అనే ప్రచారమే ఎక్కువగా జరిగేలా ఆయన జాగ్రత్తలు తీసుకునే వారు. ఖర్మకొద్దీ.. తనే అలా చెప్పుకునేవారు. సదరు సీఈవో ముచ్చట- ఆయనకు పదేళ్ల విశ్రాంతిని ప్రసాదించిన తరువాత.. ఇప్పుడు మరోమారు పగ్గాలు చేతబట్టుకునే అవకాశం వచ్చింది.

ఈసారి చంద్రబాబునాయుడు కార్పొరేట్‌ ప్రపంచంలోనే కొత్తరుచులమీద, కొత్త హోదాల మీద మనసు పారేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటిదాకా ఆయన ఈవెంట్‌ మేనేజర్‌ అవతారం ఎత్తారు. గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, ఒక నగరం పేరిట నాలుగైదుసార్లు శంకుస్థాపనలు, నదుల అనుసంధానం, లేపాక్షి ఉత్సవాలు, బీచ్‌ ఉత్సవాలు, రొమాన్స్‌ ఉత్సవాలు ఇలా నానా రకాలూ ఈవెంట్లు ప్లాన్‌ చేయడం.. సదరు ఈవెంట్‌ వల్ల మాత్రమే యావత్తు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ ఈవెంట్‌ జరగకపోతే అంతా దుంపనాశనం అయిపోతుందని తన వందిమాగధ గణాల్లోని గోబెల్స్‌ ద్వారా ప్రచారం చేయించడం చంద్రబాబు టెక్నిక్‌. ఈ 32 ఏళ్ల పాలనలో ఈవెంట్‌ మేనేజర్‌ హోదాలో ముఖ్యమంత్రి తన విలువైన కాలాన్ని తగలేసిన సందర్భాలు మిక్కిలిగానే ఉంటాయి. 

కార్యభారం ముఖ్యమంత్రిది కాదా? బాధ్యతల నుంచి పారిపోకుండా స్వయానా పూనిక వహిస్తున్నా కూడా ఇలాంటి దురుద్దేశంతో నిందలు వేయడం తగునా? అని ఎవరికైనా సందేహం కలుగవచ్చు. చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి, పొందుతున్న కీర్తిని చూసి ఓర్వలేక అంటున్నారని అనుకోవచ్చు. కానీ సర్వాంతర్యామి లాగా అన్నింటా తాను తప్ప మరొకరు కనిపించరాదన్నట్లుగా, దక్కగలిగిన కీర్తి, సానుభూతి ఇత్యాది ఏవంగుణ విశేష ప్రతిఫలములన్నియూ తనకుదక్క, మరొకరికి దక్కరాదన్న కునీతితో వ్యవహరించడమే రాష్ట్రానికి చేటు. అధికార/ ఉద్యోగ యంత్రాంగం పనిచేయవలసిన చోట ముఖ్యమంత్రి తానుగా తిష్టవేసి కూర్చుని కార్యం చక్కబెట్టానని ప్రల్లదనంతో పలికితే విస్తుపోవాల్సి వస్తుంది. ఆదిలోనే విసర్జించవలసిన అలాంటి అతిపోకడలతో పెట్రేగినందుకే గోదావరి తల్లికి ఆయన తన చేజేతులా భక్తుల్ని బలిపెట్టారు. కాదనగలమా? అయినా సరే.. ఆయనలోని 'ఈవెంట్‌ మేనేజర్‌' ముచ్చట మాత్రం చావలేదు.

ఫరెగ్జాంపుల్‌.. ఓ కంపెనీ లక్ష రూపాయల జీతానికి సీఈవోను నియమించుకున్నదని అనుకుందాం. ఆయన చాలా సింపుల్‌ మనిషి, ఉదాత్త స్వరూపుడు అని కూడా అనుకుందాం. ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే అందరికంటె ముందు ఆఫీసుకు వచ్చేసి మరుగుదొడ్లు కడిగేసి, ఆఫీసు మొత్తం తడిగుడ్డతో తుడిచేస్తూ ఉంటే, యాజమాన్యం మురిసిపోతుందా? విలపిస్తుందా? బుర్రలో కాసింత విషయం ఉన్న ఎవరైనా సరే.. ఏ అయిదారు వేలకో ఓ గంటసేపు పనిచేసే పనిచేసే పాకీవాడిని నియమించుకుంటే సరిపోయే దానికి, లక్షరూపాయల వేతనధారి రోజుకు గంట సమయాన్ని వృథా చేయడం అవసరమా? అని బేరీజు వేస్తుంది. ఎంతో విలువైన అదే గంట సమయాన్ని కంపెనీల తనకు ఉద్దేశించిన బాధ్యతల మీద పెడితే.. ఇంకెంత బాగుంటుందో కదా అని లెక్కలు కడుతుంది. Readmore!

ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వస్తోంది. అయిదు కోట్ల మంది ప్రజల సంక్షేమం, బాగోగులు సమస్తం చూడవలసిన బాధ్యత- అధికారం రూపంలో తన చేతికి దక్కితే దానిని కొన్ని రోజుల పాటు అలా గాలికొదిలేసి... దావోస్‌లో మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం యొక్క గుణవిశేషాల్ని కస్టమర్లకు వివరించుకుంటూ సేల్స్‌మేన్‌ ఉద్యోగానికి ఆయన పరిమితం అయిపోతే.. లోతుగా ఆ పరిణామాల్ని పరిశీలించే ఎవరికైనా సరే కడుపుమండకుండా ఎందుకుంటుంది?

నాయకుడిగా బాధ్యతలను ప్రజలు చంద్రబాబు చేతుల్లో పెట్టారు. దాని అర్థం.. సమస్త యంత్రాంగంతో ఆయన సమర్థంగా పనిచేయించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అవుతుందే తప్ప.. సమస్త కార్యాలను తానే స్వయంగా చేయబూని, తన సమర్థత గురించి టముకు వేసుకోవడానికి ఆరాటపడాలని అర్థం కాదు. చంద్రబాబునాయుడు ఎంతో విజ్ఞుడైన రాజనీతివేత్త అని చాలా మంది మేధావులు కూడా దేశవ్యాప్తంగా కీర్తిస్తూ ఉంటారు. మరి అంతటి మేధావి కూడా- తన కిందివారందరితోనూ సమష్టిగా పనిచేయించడం, అందరిలోని నైపుణ్యాలను వెలికితీయడం, అందరితో బాగా పనిచేయించడం అనేవి కెప్టెన్‌ లక్షణాలు అవుతాయనే మౌలిక సూత్రాన్ని విస్మరించడం ఏమిటో మనకు అర్థం కాదు. తన కిందివారితో పనిచేయించడం, ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించడం అనేది జరగకపోతే.. అన్ని పనులకూ తానే పూనుకుంటూ ఉంటే.. ఏతావతా అది తన అసమర్థతకు నిరూపణగానే నిగ్గుతేలుతుందని ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యకరం.

తనవైన బాధ్యతలను విస్మరించాడు గనుకనే చంద్రబాబు.. ముఖ్యమంత్రి పదవి కంటె ఈవెంట్‌ మేనేజర్‌ పదం రుచికరంగా ఉన్నదని ఎంచుకున్నట్లుగా చాన్నాళ్లు పనిచేశారు. ఇప్పుడు దావోస్‌ పర్యటనలో ఉన్నారు. దైవవశాత్తూ.. సదరు ఈవెంట్‌ ఆయన తానుగా నిర్వహిస్తున్నది కాదు. కేవలం పెయిడ్‌ డెలిగేట్‌ పాల్గొంటున్నది మాత్రమే. దావోస్‌ వంటి ప్రపంచ ఆర్థిక వేదికల వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉండగల అవకాశాల గురించి ప్రెజంట్‌ చేయడం ఖచ్చితంగా మంచి ప్రయత్నమే. ఆ దిశగా చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును అభినందించాల్సిందే. అయితే సెమినార్‌ లో ప్రసంగం రూపేణా తన పాత్రకు పరిమితం అయితే గౌరవంగా ఉండేది. అక్కడ ఆయన సేల్స్‌మెన్‌ అవతారం ఎత్తారు. 

ఏపీ స్టాల్‌ లో కూర్చుని వచ్చిపోయే ప్రతి కస్టమరుకు ఏపీ గొప్పదనాన్ని తాను స్వయంగా వివరించే పనికి పూనుకున్నారు. యాత్రాక్షేత్రాల్లో హోటళ్లకు గిరాకీలను తీసుకువచ్చే టాక్సీడ్రైవర్ల లాగా... రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ఘనాపాటీలు అంటూ కన్సల్టెంట్ల ముసుగులో దళారీలను ప్రోత్సహిస్తున్నారు. దళారీలు తీసుకువచ్చే కస్టమర్లకు ఏపీ ఘనతను ప్రతిరోజూ వివరించి చెప్పడమే చంద్రబాబునాయుడు దావోస్‌ స్టాల్‌ లో కూర్చుని చేస్తున్న పని! నిజానికి ఇది ఓ ఖరీదైన కార్పొరేట్‌ సేల్స్‌మెన్‌ ను నియమించుకుంటే.. చాలా చక్కగా, సజావుగా జరగగల పని కూడా! పదుల సంఖ్యలో కంపెనీల ప్రతినిధులతో భేటీలు అయినట్లుగా పెట్టుబడులకు ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే తాను ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా ప్రవర్తించాలనే ఊహ చంద్రబాబులో ఉంటే గనుక... కంపెనీల ప్రతినిధులతో దావోస్‌ స్టాల్‌ లో సేల్స్‌మెన్‌ భేటీల దశలో చేస్తున్న పని సబబు కాదు. మలిదశలో కనీసం ఒక్క కంపెనీ వారైనా వాస్తవంగా ఏపీలో పెట్టుబడుల మీద శ్రద్ధతో మన రాష్ట్రానికి పరిశీలన నిమిత్తం వచ్చి, ఆసక్తి కనబరిస్తే ఆ దశలో తాను వారితో భేటీ అయి.. వారికి ఉండగల సంశయాలను నివృత్తి చేసి, పెట్టుబడులకు భరోసా ఇవ్వాలి. అలా చేయడం ఉచితం అవుతంది.

ఉచితానుచితాలు ఎరగకుండా, ఎరిగినా పాటించకుండా.. సర్వమూ తానే అయి వెలగబెట్టాలని అనుకునే చంద్రబాబునాయుడు వైఖరి నిజానికి ప్రజలకు అనుమానాలు కూడా కలిగిస్తోంది. మూడో విడతలో గద్దె ఎక్కిన తరువాత.. ఈవెంట్‌ మేనేజర్‌ నుంచి సేల్స్‌మేన్‌ వరకు చంద్రబాబునాయుడు సాగిస్తున్న ప్రస్థానం.. రాష్ట్ర సంక్షేమార్థం జరుగుతున్న ప్రయత్నమేనా? లేదా, మరొకరికి చోటు ఇవ్వకుండా వాటాలను సాంతం తానే దండుకోవడానికి నడిపిస్తున్న ప్రహసనమా? అని ప్రజలు సందేహిస్తే తప్పేముంది?

- కపిలముని

Show comments