ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డాడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ అయిన కాపులకు రిజర్వేషన్ల అంశంపై తను చేపట్టిన దీక్షను చంద్రబాబు దొంగ దీక్ష అనడం పట్ల ముద్రగడ ఆక్షేపించారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబునాయుడు చేసిన దీక్షలను ఏమనాలి?అని ముద్రగడ ప్రశ్నించాడు.
ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబునాయుడు దీక్ష చేయాలని ముద్రగడ సూచించారు. దీక్షకు తేదీని చంద్రబాబు నే డిసైడ్ చేయాలని, తనుకూడా ఆ దీక్షలో పాల్గొంటానని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.
బావమరిది బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి బయట పడేయడానికి నువ్వు వైఎస్ కాళ్లు పట్టుకున్నావు గుర్తులేదా.. అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ముద్రగడ. చంద్రబాబు వల్లనే కాపు ఉద్యమం పుట్టిందని.. కాపులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.