సినిమాల్లో ఏదైనా జరిగిపోతుంది. 'భారతీయుడు' సినిమాలోలా అవినీతిపై పోరాడేయొచ్చు.. ఇంకేదైనా చేసెయ్యొచ్చు. రియల్ లైఫ్‌లో అవేమీ అంత తేలికైన వ్యవహారాలు కావు. తమిళనాడులో, పళనిస్వామి ప్రభుత్వం ఖరారయ్యింది. ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని అసెంబ్లీలో చాటుకున్నారు. ఇంకో ఆరు నెలలపాటు ఆయన్ని కదిలించే పరిస్థితి లేదు. కానీ, సినీ నటుడు కమల్‌హాసన్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
కమల్‌హాసన్ ఒక్కడే కాదు, అరవింద్ స్వామి సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు, తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని, గవర్నర్‌కి ఇ-మెయిల్ రూపంలో తెలపాలంటూ 'రాజ్‌భవన్ మెయిల్ ఐడీ'ని జత చేస్తూ, సోషల్ మీడియాలో హడావిడి చేసేస్తోంటే, అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఎవరి అభిప్రాయాల్ని వారు చెప్పడం తప్పేమీ కాదుగానీ, సినిమాటిక్ ఘట్టాలు రియల్ లైఫ్‌లో జరిగిపోవాలని ఆశిస్తే ఎలా.?
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవ్వాలన్నది కమల్‌హాసన్ కోరిక. అది కుదరలేదాయె. కమల్ తో పాటు చాలామంది సినీ ప్రముఖుల మద్దతున్నా, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పలేక, చతికిలపడి మాజీ అయిపోయారు పన్నీర్ సెల్వం. రాజకీయ అసమర్థుడిగా పన్నీర్‌సెల్వంని అంతా చూస్తోంటే, ఇంకా ఆయన్ని 'పైకి లేపడానికి' కమల్‌హాసన్ లాంటి సినీ జనం ప్రయత్నిస్తుండడం ఆశ్చర్యకరమే.
సినిమాల్లోలా గవర్నర్‌కి కుప్పలు తెప్పలుగా మెయిల్స్ పంపేసి, జనం తమ అభిప్రాయాన్ని చెబితే వాటికి తగ్గట్టుగా అక్కడి గవర్నర్ వ్యవహరిస్తారని ఎలా అనుకోగలం.? ఏదన్నా సినిమా సెట్స్ మీదకు వెళుతోందంటే, దాంట్లో తనకు నచ్చిన విధంగా సన్నివేశాలు మార్చేసుకోవడం కమల్‌హాసన్‌కి అలవాటే. అదే రాజకీయాల్లో చెయ్యాలంటే, ఆయనేమీ రాజకీయాల్లో చక్రం తిప్పే పొజిషన్‌లో లేడు కదా.!