విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. రాముడెలా వుండేవాడు.? కృష్ణుడి సంగతేంటి.? ఇలా దేవుళ్ళకు సంబంధించి రిఫరెన్స్ అంటే అది ఎన్టీఆర్ మాత్రమే. ఆ స్థాయిలో ఆయా దేవుళ్ళ పాత్రల్లో స్వర్గీయ ఎన్టీఆర్ నటించడం కాదు, జీవించేశారు.
తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆయన జీవిత చరిత్రను రెండున్నర గంటల సినిమాగా చూపించేయాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్ధం ఆయన మీద ఓ సినిమా తీస్తే, అది ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా వుండాలి. క్రికెటర్ ధోనీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాక్సర్ మేరీ కోమ్.. ఇలా చాలామంది బయోపిక్స్ ఈ మధ్యకాలంలో వచ్చాయి. వాటి పరిస్థితి వేరు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర వేరు. ఎన్టీఆర్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. ఒకప్పుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. సినీ నటుడిగా, రాజకీయ ప్రముఖుడిగా తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ.
అందుకే, జీవిత చరిత్ర పేరుతో సినిమా తీయాలనుకుంటే మాత్రం వివాదాలు తప్పవు. సినిమా తీసి, వివాదాలు సృష్టించడమో, వివాదాల్లేకుండా పసలేని సినిమా చేయడమో చేస్తే అది స్వర్గీయ ఎన్టీఆర్‌ని అవమానించడమేనన్నది చాలామంది వాదన. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత పోసాని కృష్ణ మురళి అయితే, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రని టచ్ చేయనే కూడదు.!
పోసాని కృష్ణమురళి మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. 'మసాలా' కోసం ఒక్క వివాదాన్ని టచ్ చేసినా, అది ఎన్టీఆర్‌ని తీవ్రంగా అవమానించినట్లేనని తెగేసి చెబుతున్నారు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ, కాంట్రవర్సీలకే కాంట్రవర్సీ.. అంటూ చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా అనగానే, ఆనందానికి బదులు ఆవేదన, భయం కలుగుతున్నాయందరికీ.
మహనీయుడి పేరు చెడగొట్టవద్దంటూ అప్పుడే వర్మని ఉద్దేశించి సినీ ప్రముఖులు, సామాన్యులూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో, వర్మ తనకు మరింత 'స్టఫ్' దొరికిందనుకుంటాడో, లేదంటే ఈ ప్రయత్నం నుంచి పక్కకి తప్పుకుంటాడో వేచి చూడాల్సిందే.
అన్నట్టు, శశికళ మీద ఓ సినిమా చేస్తానని, ఆ తర్వాత లైట్ తీసుకున్న వర్మ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పేరుతో జస్ట్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడనుకోవాలా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.