తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు నేడు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని టీఆర్‌ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి. వివిధ రూపాల్లో కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన అభిమానులు ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తెలంగాణకే పరిమితమవలేదు ఈ అభిమానం. ఒరిస్సాలోని పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మ్యాన్ ఆఫ్ ది మిషన్ గోల్డెన్ తెలంగాణ' అంటూ సైకత శిల్పంపై చెక్కి, తమ అభిమానాన్ని చాటుకున్నారు కేసీఆర్ అభిమానులు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ నుంచీ కేసీఆర్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆసక్తికరమైన విషయమే ఇది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న సమయంలో, ఆంధ్రప్రాంతంపై కేసీఆర్ విరుచుకుపడ్డారన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణలో ఉద్యమ సెగ రగల్చడానికి ఆయన దాన్ని (ఆంధ్రప్రాంతంపై అసహనాన్ని) అలా వాడుకున్నారాయన. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కూడా వీలు చిక్కినప్పుడల్లా 'ఆంధ్రోళ్ళతో పంచాయితీ' కొనసాగిస్తూనే వున్నారు. అయినాసరే, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి మద్దతివ్వడం ద్వారా కేసీఆర్, తన ప్రత్యేకతను చాటుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ పొందుతున్నారు.
పార్లమెంటు సాక్షిగా టీఆర్‌ఎస్ ఎంపీలుకూడా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. పలు సందర్భాల్లో కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఈ డిమాండ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ వెంట తాముంటామనీ చెబుతూనే వున్నారు. అందుకేనేమో, 'ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఓ కేసీఆర్ కావాలి..' అంటూ న్యూస్ ఛానల్స్ లో ఈ రోజు జరిగిన పలు చర్చా కార్యక్రమాల్లో కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు సామాన్యులు అందర్నీ విస్మయానికి గురిచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్ళినప్పుడూ ఆయనకు అనుకూలంగా నినాదాలు విన్పించిన విషయం విదితమే.