నిమ్మల, పరిటాల.. మీ కక్కుర్తి ఈ విషయాల్లోనా..!

ఇంత రుబాబా.. ఎంపీలం, ఎమ్మెల్యేలం అయినంత మాత్రానా ఇంత కండకావరమా? ఏపీలో క్రమంగా బిహార్‌ తరహా పరిస్థితులు ఏర్పడినట్టే. తహశీల్దార్‌లపై ఎమ్మెల్యేలు పట్టపగలు చేస్తున్న రుబాబు.. ఇక విజయవాడ ఉదంతం ఇంకోటి.. ప్రభుత్వ అధికారులపై డైరెక్టుగా దాష్టీకాలే.. ఇది వరకూ యూపీలో, బిహార్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోగా.. విన్నాం, కన్నాం. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా.. ఆ ముచ్చట్లన్నీ తీరుతూనే ఉన్నాయి. ఈ పరంపరలో పరమ కక్కుర్తి పనులు చేస్తున్నారు అనంతపురం జిల్లా తెలుగుదేశం నేతలు. తాజాగా కర్ణాటకలోని బాగేపల్లి వద్ద టోల్‌ గేట్‌ వద్ద జరిగిన గొడవలో హిందూపురం ఎంపీ నిమ్మల తనయులిద్దరి పేర్లూ ప్రముఖంగా వినిపించాయి. టోల్‌ అడిగారని చెప్పి.. అక్కడి సిబ్బందిపై ఎంపీ తనయుల, అనుచరుల దాష్టీకం సాగింది. మమ్మల్నే టోల్‌ అడుగుతారా.. తోలు తీస్తాం.. అని వీరు రౌడీయిజం చేశారు. అదేమంటే.. చివరకు టోల్‌ గేట్‌ కాంట్రాక్టర్ల మీద, టోల్‌ వసూలు చేసే సిబ్బంది మీద పోలీసులకు ఎదురు కంప్లైంట్‌ ఇవ్వడం వీరి తీరుకు పరాకాష్ట.

టోల్‌గేట్‌ సిబ్బంది తమతో దురుసుకు ప్రవర్తించిందని.. వారు రౌడీయిజం చేశారని.. స్వయంగా ఎంపీ నిమ్మల ఆరోపించాడు. వీరి రౌడీయిజానికి లక్షలరూపాయల విలువైన కంప్యూటర్‌ సామగ్రి ధ్వంసం కాగా, టోల్‌ సిబ్బంది తమపై రౌడీయిజం చేసిందని ఎదురు ఆరోపణ చేయడం విచిత్రం. ఇప్పుడు మాత్రమే కాదట.. తమపై గతంలో కూడా బాగేపల్లి టోల్‌గేట్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిందని నిమ్మల చెప్పుకొచ్చాడు. అంత అలజడి చేసి.. తిరిగి అరవడంతో నిమ్మలగారి ప్రతిభాపాటవాలు బయటపడుతున్నాయి.

గతంలో కూడా నిమ్మల అనుచరగణం బాగేపల్లి టోల్‌ వద్ద ఇలాంటి గొడవే చేసింది. అప్పుడు అది హైలెట్‌ కాలేదు. ఇప్పుడు విధ్వంసమే చేశారు. దీనిపై హైవేలశాఖ మంత్రి నితిన్‌గడ్కారీకి ఫిర్యాదు చేస్తానని అనడం నిమ్మల తీరులో పరాకాష్ట. ఏమని ఫిర్యాదు చేస్తారు? మొన్నేమో.. విమానం ఎక్కి శివసేన ఎంపీ ఒకరు అక్కడి ఉద్యోగిపై దాష్టీకం చేశాడు. ఇప్పుడు హైవే మీద మంత్రిగారి తనయుడి రుబాబును జనం చూస్తున్నారు. అయితే ఈ రుబాబులపై ఎదురు ప్రశ్నలు ఏమీలేవు. ఎంపీగారి తనయుడి తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారట చాలుకదా!

ఇవతల ఎంపీగారేమో.. తప్పంతా టోల్‌ సిబ్బందిదే, దీనిపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తానని అన్నారు, కానీ ముఖ్యమంత్రి గారేమో ఎంపీగారి తీరుపై అసహనం వ్యక్తం చేశారట. మరి ఇంతకీ తప్పెవరిది? అయిని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా, పోగాలం దాపురించినప్పటి వ్యవహారాలు ఇలానే ఉంటాయి.

అయితే అనంతపురంజిల్లా నేతల్లో టోల్‌గేట్‌ వద్ద కక్కుర్తిపడే వ్యవహారాలు కొత్తేమీకాదు. ఇది వరకూ కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి జిల్లా పరిధిలో. ఇది వరకూ.. అనంతపురం సమీపంలోని మామిళ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద మంత్రి పరిటాల సునీత అనుచరుల రుబాబు సాగింది. వీరి కాన్వాయ్‌ను ఆపి టోల్‌గేట్‌ అడిగిన పాపానికి అక్కడి సిబ్బందిపై దాడికి దిగింది పరిటాల అనుచరవర్గం. అయితే అది అనంత పరిధిలోని టోల్‌గేట్‌ కావడం, రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది కావడంతో.. కేసులు, మీడియా లేకుండానే వ్యవహారం సాగిపోయింది. పరిటాల అనుచరుల రుబాబు తమ నియోజకవర్గం పరిధిలో సాగగా.. నిమ్మలవర్గం రుబాబు కర్ణాటక పరిధిలోకి వచ్చే బాగేపల్లిలో సాగింది. దీంతో దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. మీడియాలో కూడా బాగా హైలెట్‌ అయ్యింది. అయినా వీళ్ల కక్కుర్తి కేవలం టోల్‌గేట్‌ చార్జీల వద్ద కావడం గమనార్హం. మహా అంటే ఒక్కో ఎస్‌యూవీకీ వసూలు చేసేది వంద రూపాయల్లోపు మొత్తమే. దీనికోసం అంత దారుణంగా వ్యవహరించడమా?

Show comments