ఏపీ మంత్రి ఎన్టీఆర్ పాటలకు డాన్సులేస్తున్నాడు!

ఐటీ శాఖ మంత్రి.. అది కూడా చంద్రన్న క్యాబినెట్‌లో మంత్రి! భారత దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేశానని.. బిల్‌గేట్స్‌తో మాట్లాడి.. భారత దేశానికి ఐటీని పరిచయం చేశానని అనునిత్యం చెప్పుకొంటూ తిరిగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి ఆయన! అది కూడా.. అమరావతి అనే భ్రమల నగరంలో ఐటీని విపరీతంగా అభివృద్ధి చేసి.. ప్రపంచానికి సవాలు విసిరే యజ్ఞం జరుగుతోందిప్పుడు! అంతేనా.. అనంతపురం నుంచి విశాఖపట్నం వరకూ.. ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఆ ఊరిని ఐటీ హబ్‌గా మార్చేస్తానని చెప్పుకోవడం కూడా వీళ్లు చేస్తున్న పనే!

మరి ఇంతటి బృహత్ యజ్ఞంలో ఉన్న ఒక సమిధ పల్లె రఘునాథ రెడ్డి. మాటల్లో చంద్రన్నకు ఏ మాత్రం తీసిపోడీయన. ఐటీతో లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని.. రాబోయే రోజుల్లో ఏపీలో కొన్ని లక్షల మందికి ఉపాధి అని.. చెప్పుకోవడం ఈయనకు అలవాటే!

ఇలాంటి నేపథ్యంలో ఇంత వరకూ ఎన్ని ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చాయి.. గత రెండేళ్లలో ఎంతమంది ఏపీ యువతీయువకులకు ఐటీ జాబులు ఇప్పించారు.. అనే మాట గురించి మాట్లాడే నాథుడు మాత్రం లేరు. రాబోయే కాలం గురించి చెప్పమంటే మాత్రం.. లక్షల ఉద్యోగాలు అనేస్తారు!

ఈ పోచికోలు కబుర్ల సంగతలా ఉంటే.. పల్లె రఘునాథరెడ్డి గారు.. ఇటీవల ఒక సభలో సీనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలకు డాన్సులేస్తూ.. చిందులేశారు! అవతల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకొంటుంటే.. చేతిలో ఐటీతో సహా అరడజను శాఖలను పెట్టుకున్న పల్లె మాత్రం ఇలా బూతు సాహిత్యానికి పార్టీ కార్యకర్తలతో కలిసి డాన్సులేసేంత తీరికతో ఉండటం గమనించాల్సిన విషయమే! 

ఏపీలో ఐటీని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పలు దేశాలను చుట్టేసి వచ్చిన రెడ్డి గారు.. అందుకు సంబంధించి ప్రగతి ఏమిటో మాట మాత్రమైన చెప్పకుండా.. ఇలాంటి చిల్లర డ్యాన్సులు చేసుకొంటూ ఉండటం పచ్చపార్టీ అభిమానులను అలరించేదేనేమో కానీ, స్వతహాగా లెక్చరర్, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చేష్టలు చేయడం మాత్రం తటస్థులు అసహ్యించుకునేలా ఉంది. 

Show comments