సోమిరెడ్డికి ఇంత మతిమరుపా?

రాజకీయ నాయకులు పైకి ఆరోగ్యంగా కనబడుతుంటారు. కాని వారికి రకరకాల జబ్బులుంటాయి. తాము చేస్తున్నదే సరైన పని అని, అదే పని ఎదుటివారు చేస్తే తప్పని భ్రమించే జబ్బు ఉంటుంది. గతాన్ని మర్చిపోయే జబ్బు ఉంటుంది. దాదాపు రాజకీయ నాయకులంతా 'గజినీ'లేనని చెప్పవచ్చు. వారు తాము ఎప్పుడూ నీతిపరులమని, నిజాయితీగా వ్యవహరిస్తున్నామని అనుకుంటూ ఉంటారు.

పాత పాపాలు ఎప్పుడూ గుర్తుకు రావు. ఇక అబద్దాలు చెప్పే జబ్బు ఉంటుంది. అలవోకగా, పబ్లిగ్గా అబద్దాలాడుతూ ఉంటారు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు...ఇలా ఎన్నో జబ్బులు వారి ఒంట్లో పేరుకుపోయి వుంటాయి. ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి 'గజినీ' అయ్యాడు. తమ అధినేత కమ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతమేమిటో మర్చిపోయిన ఈ మంత్రి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను నానా మాటలు అంటున్నారు. విమర్శలు చేసే హక్కు సోమిరెడ్డికి ఉంది. కాని గతాన్ని గుర్తు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శిస్తే బాగుంటుంది.

గత ఎన్నికల సమయంలో బీజేపీని మతోన్మాద పార్టీ అని, మతతత్వ పార్టీ అని విమర్శించిన జగన్‌, బీజేపీతో టీడీపీ బంధం తెంచుకుంటే దాంతో కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విమర్శించారు. అప్పుడు బీజేపీని మతోన్మాద పార్టీ అని విమర్శించిన జగన్‌ ఇప్పుడు ఎలా కలుస్తాడని మంత్రి ప్రశ్నించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండవనే విషయం సోమిరెడ్డికి తెలియదా?

మరి చంద్రబాబు నాయుడు బీజేపీ విషయంలో చేసిన పని ఏమిటి? ఒకప్పుడు బీజేపీని శత్రువుగా చూసి, మతోన్మాద పార్టీ అంటూ విరుచుకుపడిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా. కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉండగా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉన్నారు కదా. ఒకప్పుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాతనికి మద్దతు ఇచ్చి బాలయోగిని స్పీకర్‌ను చేశారు కదా. ఇదంతా సోమిరెడ్డికి గుర్తు లేదా? టీడీపీ-బీజేపీ బంధం విడిపోతే తాము కమలం పార్టీతో కలిసి పోటీ చేస్తామని  వైకాపా నేత బొత్స సత్యనారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. Readmore!

ఇందులో విడ్డూరమేముంది? రాజకీయ అవసరాలు శత్రువులను మిత్రులుగా చేస్తాయి. 2002లో మోదీ గుజరాత్‌ మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. గుజరాత్‌ ఘటనలపై తీవ్రంగా ఆగ్రహించిన బాబు గుజరాత్‌ సీఎం మోదీని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఒకసారి మోదీ హైదరాబాదుకు రావాలనుకున్నప్పుడు ఆయన్ని పొలిమేరల్లో అడుగుపెట్టనివ్వొద్దని పోలీసు అధికారులను  ఆదేశించారు. మోదీ ఏదో ఒకనాడు ప్రధాని అవుతారని, తానే ఆయనకు సలాములు చేయాల్సివస్తుందని బాబు ఊహించలేదు కదా. ఆనాడు చంద్రబాబు ప్రవర్తించిన తీరును మోదీ మర్చిపోలేదని, బాబు ముఖ్యమంత్రి కావడంతో అదంతా మళ్లీ మనసులోకి చేరిందని, దాని పర్యవసానమే ఇప్పటి ప్రత్యేక హోదా నిరాకరణ, అరకొర సాయమని కొందరు మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇందులోని నిజానిజాల విషయం పక్కనపెడితే హైదరాబాదులోకి మోదీని అడుగు పెట్టనివ్వవద్దని ఆదేశించిన చంద్రబాబు ఇప్పుడు మోదీకి 'జీ హుజూర్‌' అంటున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ఇవ్వకపోయినా, రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా, రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు అరకొర సాయం చేసినా కిక్కురమనకుండా ఉన్నారు. ఆంధ్రా బీజేపీ నాయకులు బంధం తెంపుకోవాలని అనుకుంటున్నా బాబు అందుకు సిద్ధంగా లేరు.

కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని బాబు నమ్ముతున్నారు. రాష్ట్రంలో బీజేపీతో బంధం తెంపుకొని తాను మళ్లీ గెలిచినా, కేంద్రం సాయం అందదని, మోదీ ఇబ్బందుల పాలుచేస్తారని భయపడుతున్నారు. కేంద్ర సాయం కోసం నేను 30 సార్లు ఢిల్లీ వెళ్లాను' అని చంద్రబాబు ఓసారి గొప్పగా  చెప్పారు. ఒకసారి బాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో మోదీ 'నాయుడుగారూ మీరు బలమైన ముఖ్యమంత్రి.

బలమైన ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి రారు' అని అన్నారట. ఈ వ్యంగ్యాన్ని చంద్రబాబు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు. ఇదీ చంద్రబాబు పరిస్థితి. సోమిరెడ్డి ఇదంతా మర్చిపోయి జగన్‌ను విమర్శించడం అర్థరహితం. చంద్రబాబు ఏ రాజకీయ అవసరాలతో తాను తిట్టిన బీజేపీతో కలిశారో, జగన్‌కూ అదే అవసరముంది. చంద్రబాబు బీజేపీ పట్ల మొదటినుంచి ఒకే స్టాండ్‌ తీసుకొని దానికి కట్టుబడి ఉంటే జగన్‌ను విమర్శించే హక్కు ఉండేది.

Show comments