లాజిక్ మిస్సవుతున్న వైసీపీ నేతలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలతో విజృంభించి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసే ప్రతి సందర్భంలోనూ, తెలుగుదేశం పార్టీ ఒకే రకమైన దాడితో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. వైసీపీ ఏ ప్రజాసంబంధిత అంశం మీద పోరాడుతున్నదో.. ఆ అంశానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడరు. స్పందించరు. సమాధానం చెప్పరు. కాకపోతే.. జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడా మాట్లాడేది.. అమరావతిలో నివాసం లేని నాయకుడా మాట్లాడేది? అంటూ అర్థం లేని మాటలు వల్లిస్తూ ఉంటారు. నిజానికి నివాసం గురించినది అర్థం లేని విమర్శ. ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి పదవిని వెలగబెడుతున్న చంద్రబాబు కు కూడా అమరావతిలో నివాసం లేదు. ప్రభుత్వం క్వార్టర్ ఇచ్చింది గనుక ఆయన అందులో ఉంటున్నారు. ప్రతిపక్షనేతకు కూడా క్వార్టర్ ఇస్తే జగన్ కూడా అందులో ఉంటారు కదా.. అని లాజికల్‌గా వాదించవచ్చు. కానీ ఈ విమర్శలు ప్రజలకు సూటిగా తాకుతాయి. ఇదే ఒక సమస్య అయితే.. వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకహోదా గురించి, ఆ రాష్ట్రంలోని సమస్యలు, రైతుల కష్టాల గురించి ప్రెస్ మీట్ లు పెట్టేప్పుడు హైదరాబాదు వేదికగా మాట్లాడడం మరీ ఘోరంగా ఉంది. 

అసలే వైసీపీ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల విషయంలో అతిథి పాత్రను మాత్రమే పోషిస్తున్నదనే విమర్శలు పాలకపక్షం నుంచి తరచుగా వినిపిస్తూ ఉంటాయి. జగన్ కు హైదరాబాదులో నివాసం ఉన్నది గనుక.. పార్టీ నాయకులతో కీలక సమావేశాలు హైదరాబాదులోనే జరిగితే అందులో తప్పేమీ లేదు. పార్టీ అంతర్గత సమావేశాలు ఎన్ని హైదరాబాదులో జరిగినా తప్పులేదుగానీ.. బహిరంగంగా ప్రెస్ మీట్‌లు పెట్టినప్పుడు మాత్రం ఏపీ సమస్యల గురించి మాట్లాడదలచుకుంటే.. ఏపీ పరిధిలోంచే మాట్లాడడం సబబుగా ఉంటుంది. ఇంత చిన్న లాజిక్‌ను పట్టించుకోకుండా.. వైసీపీ నాయకులు హైదరాబాదులోనే పత్రికా సమావేశాలు పెడుతూఉంటే రాజకీయ ప్రత్యర్థులకు తమను విమర్శించడానికి మరో అవకాశం తామే అందించినట్లుగా అది మారుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత నిర్వహణ దృష్ట్యా ఇలాంటి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హైదరాబాదు కేంద్ర కార్యాలయంలో జగన్‌తో సమావేశం అయిన వెంటనే ప్రెస్‌తో మాట్లాడేయడం మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప.. హైదరాబాదులో ఏపీ విషయాలు మాట్లాడుతోంటే.. మీడియా ఫోకస్ కూడా తగ్గుతుందనే వాస్తవాన్ని వారు గుర్తించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారికంగ తమ భారీ కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతి లో ఎప్పుడు ప్రారంభిస్తుందనేది పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ప్రెస్ తో ప్రజలతో మాట్లాడడానికి విజయవాడ వేదికగానే మాట్లాడుతూ ఉంటేనే సరైన ప్రచారం దక్కుతుందని, ఒకరు వేలెత్తి చూపే అవకాశం లేకుండా సమంజసంగా ఉంటుందని.. జగన్ దళంలోని నాయకులు గుర్తించాలి. 

Show comments