జవానూ.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం.?

దేశమంతా దీపావళి పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటోంది. నిన్నటినుంచే సంబరాలు మొదలయ్యాయి. కాస్సేపట్లో ఆకాశంలో కోటి కాంతులు దర్శనమివ్వబోతున్నాయి. దేశ ప్రజలందరికీ ఏడాదికి ఒక్కసారే దీపావళి వస్తుంది.. ఆకాశంలో ఈ స్థాయిలో కోటి కాంతులు ఏడాదికి ఒకే ఒక్కసారి.. మహా అయితే, ఇంకో రెండు మూడు పండగలకి ఇలా ఆకాశాన్ని రంగులతో నింపేస్తామేమో.! 

కానీ, సైనికులు అలా కాదు. నిత్యం దీపావళి పండగని చూసేస్తుంటారు. అసలు ఆ పండుగ చేసేది వాళ్లే.. అందులో బలైపోయేదీ వాళ్ళే. సరిహద్దుల్లో శతృదేశం పాకిస్తాన్‌తో నిత్యం పోరాటమే చేయాల్సి వస్తోంది మన జవాన్లకి. కాల్పుల విరమణ ఒప్పందం.. అనేదొకటుందన్న విషయాన్ని పాకిస్తాన్‌ ఎప్పుడో మర్చిపోయింది. అట్నుంచి రాకెట్లు దూసుకొస్తాయ్‌.. బుల్లెట్లు దూసుకొచ్చేస్తాయి.. కొన్ని సందర్భాల్లో అవి మన జవాన్ల ప్రాణాల్ని తోడేస్తాయి. కానీ, మన జవాన్లు వాటిని చూసి బెదిరిపోరు. వీలు చిక్కినప్పుడల్లా గుణపాఠం నేర్పుతూనే వుంటారు. 

గడచిన కొద్ది రోజులుగా ఇండియా - పాకిస్తాన్‌ బోర్డర్‌లో పరిస్థితులు భయానకంగా తయారయ్యియి. ఈ నేపథ్యంలో, భారతదేశమంతటికీ ఓ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. సైన్యానికి మద్దతుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రజలంతా సందేశాలు పంపాలన్నది ఆ పిలుపు తాలూకు సారాంశం. ఇంకేం, క్షణాల్లో లక్షలు, కోట్లాది మెసేజ్‌లు సైనికులకు అందేశాయి. సరిహద్దుల్లో వందలాది, వేలాది మంది సైన్యమే వున్నారు.. వారికి, దేశంలోని మొత్తం 125 కోట్ల మంది భారతీయులూ అండగా వున్నారు. 

'అవును, మేం చేసుకుంటోన్న ఈ పండుగల వెనుక మీ త్యాగాలున్నప్పుడు.. ముందుగా మీ త్యాగాల్నే కొనియాడాలి కదా..' ఇది సగటు భారతీయుడి అంతరంగం. ప్రధాని నరేంద్రమోడీ, ఈ దీపావళిని సైనికులకు అంకితమిచ్చారు. ఆయనొక్కరే కాదు, దేశమంతా ఈ దీపావళి వేడుకల్ని భారత సైన్యానికే అంకితమిచ్చేస్తోంది. జై జవాన్‌.!

Show comments