బాబుగారి పేరు.. సహారా డైరీస్ లో కూడా!

ఇందుగలడు అందులేడు.. అనడానికి లేకుండా పోయింది… ఇప్పటికే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ ర్యాంకును సాధించి పెట్టాడనే ఖ్యాతిని సొంతం చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడి పేరు ఇప్పుడు సహారా డైరీస్ వ్యవహారంలో కూడా వినిపిస్తోంది. ఈ కుంభకోణం ఆరోపణలపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డైరీల్లోని పేర్లను చదివి వినిపించారు. 

వీటిల్లో చంద్రబాబు పేరు కూడా ఉండటం విశేషం! ఇంతకీ ఏమిటీ సహారా డైరీలు .. ఏమిటీ వీటి కథాకమామీషు అంటే, నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల్లో సహారా సంస్థ నుంచి ముడుపులు పుచ్చుకున్నాడని కొన్నాళ్ల క్రితం ఆప్ కన్వీనర్ నుంచి ఆరోపణలు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని అందిపుచ్చుకుంది. సహారా సంస్థపై జరిపిన ఐటీ దాడుల్లో దొరికిన డైరీల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై వరసగా ట్వీట్ల యుద్ధం మొదలైంది. 

దీనిపై కొంతమంది కోర్టుకు ఎక్కారు. ఈ నేపథ్యంలో.. సహారా డైరీస్ లో ఎవరెవరి పేర్లున్నాయో ప్రశాంత్ భూషణ్ చదివి వినిపించారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం.. ‘ సుష్మా స్వరాజ్ , చంద్రబాబు, అద్వానీ, ములాయం, రవిశంకర్, సుశీల్ కుమార్ షిండే, షీలా దీక్షిత్, ఫరూక్ అబ్దుల్లా, ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, దిగ్విజయ్ సింగ్…’ వీళ్లందరికీ ఆ సంస్థ నుంచి ముడుపులు అందాయి. ఈ విషయాలను ఆ డైరీల్లో నిక్షిప్తం చేశారు. మరి అన్ని ప్రముఖ పార్టీలకు చెందిన వారికీ సహార సంస్థ ఎందుకు డబ్బులిచ్చుకుంది? ఎంతెంత ఇచ్చింది? అనే విషయాల గురించి వెలుగులోకి రావాలంటే విచారణ జరగాల్సి ఉంది.

కానీ.. ఈ బాణం సూటిగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఎక్కుపెట్టింది కాబట్టి, ఈ విషయాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. అలాంటి డైరీల్లోని రాతలకు విచారణ అర్హత లేదని  వాదిస్తోంది. కోర్టు తీరు కూడా దాదాపు ఇలానే ఉంది! అయినా సదరు సహారా సంస్థ.. కావాలని ఇలాంటి డైరీలను తయారు చేసి పెట్టుకుని ఉంటుందా? ఏదేమైనా.. ఏపీ  సీఎం, తరచూ తను ‘నిప్పు’ను అని చెప్పుకునే చంద్రబాబుగారి పేరు మరో అవినీతి ఆరోపణల వ్యవహారంలో కూడా స్థానం సంపాధించింది. ఇది గమనించాల్సిన విషయం. 

Show comments