సుజన ఫేస్ కాస్త వెనక్కు తిప్పండి

సుజన సారు..భలే సెలవిచ్చారు..ఏమనీ..''...మెడికల్ కాలేజీ సీటు కావాలంటే ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లకూడదు, అలాగే ప్రత్యేక హోదా కావాలంటే ఇక్కడ బంద్‌లు చేసేకంటే ఎవరైతే దాన్ని ఇవ్వాలో అక్కడికెళ్లి చేయాలి..'' అని. నిజమే కదా? మా బాగా చెప్పారు కదా అని తెలుగుదేశం వాళ్లు చంకలు గుద్దు కోవచ్చు. 

ఎందుకంటే వాళ్లకు కావాల్సింది ఆంధ్రలో ప్రతిపక్షం అల్లరి చేయకూడదు. ప్రభుత్వాన్ని అల్లరి పెట్టకూడదు. ఢిల్లీలో ఏమైనా చేసుకోండి అన్నది వాళ్ల ఫీలింగ్. కానీ కాస్త వెనక్కు వెళ్లి ఎన్టీఆర్ ను నాదెండ్ల గద్దె దింపినప్పటి వైనం గుర్తు తెచ్చుకోండి. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాదెండ్లకు సహకరిస్తే, ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేసారా? ఆంధ్రలో చేసారా? అంతకన్నా ముందు ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఆంధ్రకు ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేసారా? ఇక్కడే చేసారా? తెలంగాణ కావాలని తెలంగాణ వాదులు ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేసారా? తెలంగాణలో చేసారా? 

అంతెందుకు బ్రిటిష్ పాలన పోవాలని స్వాతంత్ర్య పోరాటం మన దేశంలో చేసామా? బ్రిటన్ గడ్డ మీద చేసామా?  నాలుక వుంది కదా? అని మన పాలనకు మచ్చ రాకూడదని, మన జనాలకు మన గురించి నిజాలు తెలియకూడదని ఢిల్లీ వెళ్లమని సలహాలు ఇవ్వడం కాదు. చేతనైతే ఇక్కడ జనాలకు నిజం వివరించి, వారిని ముందుకు నడిపించి హోదా తీసుకురాగలగడం. అది చేతకానపుడు ఇలాంటి ఉచిత సలహాలు అనవసరం కదా?

Show comments