చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరి దృష్టీ అతడి మీదే!

ప్రస్తుతం అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాతో బోయపాటి శ్రీను బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తదుపరి మాత్రం బోయపాటి పేరు ఏకంగా రెండు బడా ప్రాజెక్టుల్లో వినిపిస్తోంది. అందులో ఒకటి చిరంజీవి సినిమా, రెండోది బాలకృష్ణ సినిమా!

150 వ సినిమా అనంతరం చిరంజీవి చేసే సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించనున్నాడని గట్టి ప్రచారమే జరుగుతోంది. ఈ ఇన్నింగ్స్ లో మాస్ ఎంటర్ టైనర్లకే ప్రాధాన్యతను ఇస్తున్న చిరంజీవి ఇప్పటికే ఇలాంటి సినిమాలతో సత్తా చాటుకున్న బోయపాటి మీద నమ్మకం ఉంచాడు. ఇప్పటికే మెగా క్యాంప్ లో ఒక సినిమా చేసిన బోయపాటితో సినిమాకు చిరు ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇక బాలకృష్ణ కు బోయపాటికి ఉన్న అనుబంధం ఏమిటో చెప్పనక్కర్లా. బాలయ్యకు అత్యవసరమైన స్థితిలో హిట్టును ఇవ్వడంతో పాటు బోనస్ గా ఇంకో హిట్టును కూడా ఇచ్చాడు బోయపాటి. బాలయ్య 101వ సినిమా మొన్నటి వరకూ వార్తల్లో ఉండిన ‘రైతు’ ఇప్పుడు పట్టాలెక్కే పరిస్థితిలో లేదనే మాట వినిపిస్తోంది. ఇందులో ఒక పాత్రకు  అమితాబ్ అయితే బాగుంటుందని దర్శకుడు కృష్ణవంశీ భావించడంతో ఈ మేరకు ఆ స్టార్ హీరోను సంప్రదించడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా చేయలేనని అమితాబ్ స్పష్టం చేయడంతో.. ‘రైతు’ సినిమా ఆగిపోయేనట్టే అని అంటున్నారు.

ఎలాగూ ‘గౌతమీ పుత్రశతకర్ణి’ డిఫరెంట్ సినిమా. దాని తర్వాత కూడా ప్రయోగాత్మక సినిమా చేయడం కన్నా సింహా, లెజెండ్ లాంటి సబ్జెక్టు అయితే బాగుంటుందనేది బాలయ్య లెక్కగా తెలుస్తోంది. ఈ విషయంలో బోయపాటి మీదే బాలయ్యకు నమ్మకం ఉంది. దీంతో 101వ సినిమా బోయపాటితోనే.. అనేది లేటెస్ట్ టాక్.

ఇలా చిరంజీవి 151 వ సినిమాకు, బాలయ్య 101వ  సినిమాకూ ఒకే దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఈ రెండూ ఒకేసారి పట్టాలెక్కాలి. మరి ఈ రెండింటిలో బోయపాటి ఛాయిస్ ఏదవుతుందో! 

Show comments