జగన్‌ ఆస్తుల స్వాధీనమెప్పుడు.?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి అత్యుత్సాహం చూపిస్తోంది. ఇదిప్పటి మాట కాదు. చాన్నాళ్ళుగా టీడీపీ నేతలు ఈ మాట చెబుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, జగన్‌ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చాలాసార్లు ప్రకటించేశారు. మొన్నీమధ్యనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జగన్‌ ఆస్తులు.. వాటితోపాటుగా, జగన్‌ నేతృత్వంలో నడుస్తున్న సాక్షి మీడియాని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైందని చెప్పేశారు. 

తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జగన్‌ ఆస్తుల్ని 'అటాచ్‌' చేయడంతో, మొత్తంగా ఆస్తుల అటాచ్‌మెంట్‌ ప్రక్రియ పూర్తయ్యిందన్న వాదన విన్పిస్తోంది. చంద్రబాబు చైనా పర్యటన నుంచి వచ్చీ రాగానే, జగన్ ఆస్తుల స్వాధీనంపై కసరత్తులు జోరందుకుంటాయంటూ అధికార పార్టీ నుంచి లీకులు బయటకు వస్తుండడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో జగన్‌ గతంలో జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసు నుంచి పలువురు ప్రముఖులు ఒకరొకరుగా ఉపశమనం పొందుతుండడం తెల్సిన విషయాలే. ఈ కేసుల్లో ఏ1 జగన్‌ అయితే, ఏ2గా విజయసాయిరెడ్డి వున్నారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. 

ఆస్తుల అటాచ్‌మెంట్‌ అనేది ఈడీ విచారణలో ఓ ప్రక్రియ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఈడీ అటాచ్‌మెంట్‌ తర్వాత, జగన్‌ ఆస్తుల స్వాధీనంపై అత్యుత్సాహం చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా సాక్షి మీడియాపైనే టీడీపీ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆల్రెడీ, సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షలు విధించడం ద్వారా, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన చంద్రబాబు సర్కార్‌, ఈసారి సాక్షి పత్రికను 'స్వాధీనం' చేసుకోవడం తర్వాత, 'పచ్చ మీడియాల్లో సాక్షిని' కూడా కలిపేయాలన్న కుతంత్రాలకు సమాయత్తమయ్యింది. 

అయితే, ఆస్తుల స్వాధీనం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రం కర్నాటకలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ జగన్‌ ఆస్తులున్నాయి. సాక్షి మీడియా ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తరించి వుంది. అలాంటప్పుడు, మీడియా సంస్థని స్వాధీనం చేసుకునే ఛాన్స్‌ చంద్రబాబు సర్కార్‌కి ఎలా వుంటుంది.? 

'స్వాధీనం' పేరుతో సాక్షి మీడియాలోని సిబ్బందిని బెదిరించడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాల్ని రచిస్తోందన్నది ఇక్కడ సుస్పష్టం. అదే సమయంలో, జగన్‌ని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఆస్తుల స్వాధీనం.. అనే ప్రకటనలు టీడీపీ నుంచి, పైగా మంత్రుల నుంచీ వస్తున్నాయన్నది నిర్వివాదాంశం. అంతకు మించి, ఆస్తుల స్వాధీనం అనే ప్రక్రియ ముందుకు నడిచే అవకాశాలు దాదాపు శూన్యమే అని చెప్పొచ్చు.

Show comments