మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కి షాకిచ్చారు. విభజన చట్టం అమలులో టీడీపీ, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంటే, ఆ కుట్రలో వైఎస్సార్సీపీ కూడా భాగం పంచుకుంటోందని ఆరోపించారాయన. ఎన్నికల హామీల సంగతి దేవుడెరుగు బీపేపీ - టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేయాల్సి వుందని డిమాండ్ చేసిన ఉండవల్లి, విభజన చట్టంతోపాటు ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై వైఎస్సార్సీపీ అటు కేంద్రాన్నీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ ప్రశ్నించకపోవడం అనుమానాస్పదంగా వుందని గుస్సా అయ్యారు.
ఈ మధ్యకాలంలో ఉండవల్లి, వైఎస్సార్సీపీకి దగ్గరగా జరుగుతున్న విషయం విదితమే. జగన్‌తో ఎక్కడ తేడా వచ్చిందోగానీ, ఆయన ప్లేటు ఫిరాయించేశారు. బ్లాక్ మనీ పేరుతో టీడీపీ - వైఎస్సార్సీపీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి తప్ప, ఈ రెండు పార్టీలకీ, రాష్ట్ర భవిష్యత్‌పై చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేసేయడం ఆశ్చర్యకరమే మరి. 'వైఎస్ జగన్ అంటే ఇష్టం.. కానీ, అంతకన్నా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఇష్టం.. జగన్ రాజకీయ వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నారు.. జగన్‌కి బోల్డంత పొలిటికల్ ఫ్యూచర్ వుంది..' ఇలా రకరకాల అభిప్రాయాలతో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉండవల్లి కన్‌ఫ్యూజ్ చేస్తూనే వుండడం విశేషమే మరి.
ఉండవల్లి రూటే సెపరేటు. ఆయన ఎప్పుడు ఎవర్ని ఏ రకంగా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తారో ఊహించడం కష్టం. ఉండవల్లి ప్రత్యేక హోదాపైనా, ప్రత్యేక ప్యాకేజీపైనా మాట్లాడుతూ, ఇతరత్రా అంశాలపై గట్టిగా నినదిస్తున్న తీరు చూసి, జగన్ ఆయన్ని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం. ఈ క్రమంలోనే, పార్లమెంటులో విభజన సందర్భంగా జరిగిన పరిణామాలపై తన మీడియా సంస్థలో ప్రత్యేక కథనాలకు జగన్ ఆస్కారం కల్పించారు. కానీ, ఉండవల్లి ఇదో, ఇలా ఝలక్ ఇచ్చేశారు జగన్‌కి.
పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలు పెరిగిపోతున్నాయనీ, పట్టిసీమ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసిన చంద్రబాబు సర్కార్, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా గాలికొదిలేసేందుకు రంగం సిద్ధం చేస్తోందనీ, అయినా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిలదీయలేకపోతోందని ఉండవల్లి ఆరోపించేశారు. మొత్తంగా చూస్తే, టీడీపీని విమర్శించడం సంగతేమోగానీ, ఆ ముసుగులో ప్రతిపక్షాన్ని ఉండవల్లి టార్గెట్ చేసిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.