రెండేళ్ళకు మెలకువొచ్చిందా కేటీఆర్‌.?

హైద్రాబాద్‌ ప్రజలు నగరంలో రోడ్ల దుస్థితిపై అసహనంతో వున్నారనే విషయం రెండేళ్ళ తర్వాత గుర్తుకొచ్చింది తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్‌ కేటీఆర్‌గారికి. మొన్న ఓ సారి కాలనీ రోడ్ల దుస్థితిని పరిశీలించారు.. ఈ మధ్యనే ఇంకో చోట అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు.. ఇప్పుడేమో, ప్రజలు అసంతృప్తితో వున్నారని సెలవిచ్చారు. అంతేనా, ప్రజలేమీ తమనుంచి అద్భుతాలు ఆశించడంలేదనీ, కనీస సౌకర్యాల్ని కోరుకుంటున్నారనీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కేటీఆర్‌. 

కామెడీ కాకపోతే, ఇప్పుడేమన్నా కేటీఆర్‌ విపక్షంలో వున్నారా.? మంత్రిగా వుండి, ప్రజలు అసంతృప్తితో వున్నారని.. అదీ రెండేళ్ల పాలన తర్వాత వ్యాఖ్యానించడమేంటి.! పొద్దున్న లేస్తే, తెలంగాణలో ఈ దుస్థితికి సీమాంధ్ర పాలకులే కారణమని నినదిస్తారు. ఏం, రెండేళ్ళలో గత పాలకుల్ని మించి హైద్రాబాద్‌లో రోడ్లను అభివృద్ధి చెయ్యలేకపోతున్నారేం.! గత పాలకుల్ని మించి కాదు కదా, కనీసం గతంలో వున్నట్లు కూడా లేవిప్పుడు హైద్రాబాద్‌లోని రోడ్లు. 

హైద్రాబాద్‌ భాగ్యనగరం కాదు, రోడ్ల దుస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన నగరంగా హైద్రాబాద్‌ని రికార్డులకెక్కించేయొచ్చేమో. రోడ్ల పరంగా హైద్రాబాద్‌ అంత దయనీయ స్థితిలో వుంది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల తర్వాత మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌కి బాధ్యతలు వచ్చినా, అంతకు ముందునుంచే అయ్యగారు హైద్రాబాద్‌ బాధ్యతల్ని అనధికారికంగా తీసుకున్నారు. 

ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే హైద్రాబాద్‌ని విశ్వనగరంగా మార్చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు.. ఇప్పుడూ చెబుతూనే వున్నారు. ఏదీ, ఎక్కడ.? విశ్వనగరం కాదు కదా, ఒకప్పటి భాగ్యనగరంలా వుంచినా ఇన్ని తిప్పలు జనానికి వుండేవి కావేమో. హైద్రాబాద్‌లో ఆసుపత్రులకు వెళుతున్న వారిలో సగం మంది, రోడ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా శ్వాస కోశ వ్యాధులు, ఆర్థోపెడిక్‌ సమస్యలతోనే ఎక్కువమంది బాధపడ్తున్నారు. 

కొత్త యాప్‌ని ఈ రోజు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించేశారు. ఆ యాప్‌ ద్వారా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేయొచ్చట. ప్రజలు ఫిర్యాదు చేసేదాకా ఎందుకు.? అధికారులు రోడ్డెక్కితే, అట్నుంచటే ఆసుపత్రులకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు సమస్య పూర్తిగా అర్థమవుతుంది. యాప్‌లు, సీసీ కెమెరాలు, వైఫైలు.. ఇవి కాదు, నగర ప్రజానీకం కోరుకుంటున్నవి. అర్థమవుతోందా కేటీఆర్‌ సాబ్‌.!

Show comments