అతి త్వరలో వెయ్యి రూపాయల నోటు అందుబాటులోకి రానుందట. ఈ విషయాన్ని డిసెంబర్ 31న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటిస్తారట. పెద్ద పాత నోట్ల రద్దు ప్రకటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ 53 రోజులకుగాను మళ్ళీ జాతినుద్దేశించి ప్రకటన చేయలేకపోయారు. ఎలాగైతేనేం, రేపు సాయంత్రం (అంటే, శనివారం డిసెంబర్ 31) నరేంద్రమోడీ మీడియా ముందుకు వస్తున్నారు. ఈ రాకతో దేశంలో కరెన్సీ సంక్షోభం తొలగిపోవచ్చని దేశమంతా ఎదురుచూస్తోంది.
కరెన్సీ సంక్షోభం మాటెలా వున్నా, వెయ్యి రూపాయల నోటు మళ్ళీ వస్తోందన్న వార్త అందర్నీ షాక్‌కి గురిచేసింది. పైగా, అది పాత వెయ్యి రూపాయల నోటు అట. అంటే, దానర్ధం బ్యాంకులకు చేరిన పాత వెయ్యి రూపాయల నోటుని, మళ్ళీ చెలామణీలోకి తీసుకువస్తారన్నమాట. ఇది నిజమే అయితే, దేశ ప్రజానీకాన్ని నరేంద్రమోడీ వెర్రి వెంగళప్పల్ని చేసినట్లే. అదే సమయంలో, మోడీ కొరివితో తల గోక్కున్నట్లే.! అందుకే, బహుశా అంత రిస్క్ చేయకపోవచ్చు.
వెయ్యి రూపాయల నోటు తీసుకొచ్చే ఆలోచన అయితే కేంద్రానికి వుంది. కొత్త డిజైన్‌తో వెయ్యి రూపాయల నోటు జనవరి 1 నుంచి అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎటూ 2 వేల రూపాయల నోటు పట్ల వ్యతిరేకత పెరుగుతున్న దరిమిలా, దాన్ని రద్దు చేసినా చేసెయ్యొచ్చుగాక. ఏదైనా జరగొచ్చు కానీ ఏం జరుగుతుందో ఊహించలేం. ఎందుకంటే, పర్యవసానాలు ఆలోచించకుండా, తుగ్లక్ తరహాలో నరేంద్రమోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు గనుక.
50 రోజులు ఓపిక పట్టండి.. అంటూ దేశాన్ని ఉద్దేశించి గతంలో పిలుపునిచ్చిన నరేంద్రమోడీ, 50 రోజులు దాటాక కూడా మొహం చాటేస్తూనే వున్నారు. డిసెంబర్ 31న ముహూర్తం నిర్ణయించుకున్నారు గనుక, మూడు రోజులు ఆలస్యంగానే అయినా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు గనుక స్వాగతించాల్సిందే. కానీ, మూలిగే నక్క మీద తాటిపండు.. అన్న చందాన మోడీ, దేశ ప్రజానీకం నెత్తిన మరో బాంబు పేల్చుతారా.? ఉపశమనం కల్పిస్తారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.