'జననేత' శూన్యమైన తమిళనాడు...!

మనకు పేరుకు అనేకమంది నాయకులు ఉన్నారు. కానీ కొందరిని 'టవరింగ్‌ పర్సనాలిటీస్‌' అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే అఖండమైన జనాదరణ ఉన్న నాయకులు. ఒక్కమాటలో చెప్పాలంటే 'జననేత' అనొచ్చు. ఉదాహరణకు...జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఎన్‌టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ఇలాంటివారు కొందరు కనబడతారు. ప్రజాదరణ ప్రాతిపదికగానే వీరిని జననేతలని అంటున్నాం.

జనాదరణ ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలుంటే జననేత అనొచ్చా? అనే ప్రశ్న రావొచ్చు. విచిత్రమేమిటంటే అవినీతి ఆరోపణలున్నప్పటికీ, వారు కాలం చేసినప్పటికీ ఇప్పటికీ జనాదరణ తగ్గని నేతలున్నారు. ఇతర విషయాలు ఎలావున్నా వారంతా టవరింగ్‌ పర్సనాలిటీలేనని చెప్పొచ్చు. ఇలా చెప్పుకోవల్సిన పర్సనాలిటీల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూనే దివంగతురాలైన జయలలిత ప్రముఖురాలు. ఆమె అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయినా, జైలుకు వెళ్లినా, చనిపోయాక దోషిగా తేలినా జనాదరణ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ ఆమె స్థానాన్ని భర్తీ చేసే నాయకురాలుగాని, నాయకుడుగాని లేరు. 

ఈమధ్య ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వెళ్లినప్పుడు జయలలిత లేని లోటు కనబడుతోందని, ఆమె లేని రాష్ట్రం శూన్యంగా ఉందని అన్నారు. ఆమెను న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన విషయం మోదీకి తెలుసు. అయినప్పటికీ రాజకీయంగా ఆమె స్థానాన్ని తక్కువచేసి చూడటం సాధ్యం కాదని ఆయన అభిప్రాయం. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కామరాజ్‌ నాడార్‌, అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌ ఆ తరువాత జయలలితవంటి ఉద్దండులు ఉండేవారు.

తమిళనాడు పేరు చెప్పుకోగానే వీరి పేర్లే గుర్తుకొచ్చేవి. కాని జయలలిత మరణం తరువాత చెప్పుకోవడానికి ఒక్క పేరూ కనబడటంలేదని రాజకీయ పండితులు అంటున్నారు. జయలలితవంటి నాయకురాలుగాని, నాయకుడుగాని సమీప భవిష్యత్తులో ఉద్భవించే అవకాశం లేదంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయలలితతో సమానమైన నాయకుడు. ఒకవిధంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. ఆయన రాజకీయాల్లో చాలా సీనియర్‌.

అయినప్పటికీ జయలలిత జనాదరణలో ఆయన్ని కూడా అధిగమించారు. తొంభై ఏళ్లు దాటిన కరుణానిధి శారీరకంగా అచేతనావస్థలో ఉన్నారు. ఆయన రాజకీయ జీవితానికి తెరపడిపోయింది. జీవించివున్న రాజకీయ దిగ్గజం ఆయన ఒక్కడే. డీఎంకేకు వారసుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఉన్నారు. తమిళనాడు సమకాలీన రాజకీయాల్లో గుర్తింపు ఉన్న స్టాలిన్‌ భవిష్యత్తులో బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి.

రాజకీయంగా అన్నాడీఎంకే విఫలమైతే పరిపాలన పగ్గాలు స్టాలిన్‌ చేతికి వచ్చే అవకాశముంది. కాని ఆయన్ని ఎదుర్కొనేవారు అన్నాడీఎంకేలో కనబడటంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జయలలితకు రాజకీయంగా వారసులు లేరు.  అసలు అన్నాడీఎంకే ఒక పార్టీగా లేదు కదా...!

జయలలిత మరణం తరువాత గ్రూపు రాజకీయాల కారణంగా అది మూడు ముక్కలు (పళనిసామి, పన్నీరుశెల్వం. శశికళ) అయిపోయింది. కాబట్టి అసలైన, బలమైన అన్నాడీఎంకే లేదు. ప్రస్తుతం ఉన్నది అన్నాడీఎంకే ప్రభుత్వమా? అంటే 'అవును' అని జవాబు చెప్పలేం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఉంది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. పళనిసామికి అఖండమైన జనాదరణ లేదు. శశికళ జైలుకు వెళుతూ కుర్చీలో కూర్చోబెట్టింది.

సరే...మాజీ ముఖ్యమంత్రి పన్నీరు శెల్వం చరిత్ర తెలిసిందే. సొంత ప్రకాశం లేని జయలలిత భక్తుడు. ఇక శశికళ చరిత్ర జైల్లో ముగిసిపోవల్సిందే. సినిమా హీరోగా జనాదరణ ఉన్న రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడన్నారు. ఆయనదో ఊగిసలాట. కమలహాసన్‌ ఏవో రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు హీరోలకు రాజకీయాలపై స్పష్టత ఉందో లేదో తెలియదు. జయలలిత, ఎంజీఆర్‌ వంటి చరిస్మా ఉన్న నాయకులు ఎప్పుడు వస్తారోనని తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారట...! 

Show comments