నారాయణ 'అండర్‌ కంట్రోల్‌'.!

టీడీపీ నేత, మంత్రి, విద్యా సంస్థల అధిపతి నారాయణ 'సందడి' ఈ మధ్య తగ్గింది. కొన్నాళ్ళ క్రితం దాకా మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరే కన్పించేది. టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాత నారాయణ గురించిన చర్చే ఎక్కువగా జరిగేది. అయితే, అమరావతి భూ కుంభకోణం తర్వాత క్రమక్రమంగా నారాయణ హవా తగ్గుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో అయితే చాలా అరుదుగా మాత్రమే నారాయణ మీడియా ముందుకొస్తున్నారు. 

ఇంతకీ, తెరవెనుక ఏం జరిగింది.? 'నారాయణా తగ్గు తగ్గు..' అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారా.? అమరావతి భూ కుంభకోణం తర్వాత, పార్టీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతోనే నారాయణ స్పీడు తగ్గించుకున్నారా.? ఇంతకీ, నారాయణ 'స్లో' అవడం వెనుక కారణమేంటి.? రాజకీయ వర్గాలు ఇప్పుడీ ప్రశ్నల చుట్టూనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

నారాయణ ప్రజల మద్దతుతో 'నాయకుడు' అన్పించుకోలేదు. టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించి, రాత్రికి రాత్రి నాయకుడైపోయిన విషయం విదితమే. మంత్రి పదవి ఇచ్చి, చంద్రబాబు 'రుణం' తీర్చుకోబట్టి నారాయణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హల్‌చల్‌ చేయగలుగుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే, అమరావతి కుంభకోణంలో ప్రధానంగా నారాయణ చుట్టూనే ఆరోపణలు రావడంతో, వ్యవహారాన్ని కామప్‌ చేయడానికి నారాయణ హవాని చంద్రబాబే తగ్గించారన్నది నిర్వివాదాంశం. సొంత పార్టీ నుంచే నారాయణ పట్ల వ్యతిరేకత పెరుగుతుండడమే ఇందుకు కారణం. 

ఎలాగైతేనేం, నారాయణ హవా తగ్గినందుకు టీడీపీ నేతలే పండగ చేసుకుంటున్నారు. ఇంకోపక్క, మంత్రి పదవి నుంచి నారాయణను తొలగించాలన్న డిమాండ్లతో చంద్రబాబుకి తల బొప్పి కట్టేస్తోంది. మంత్రి వర్గ విస్తరణ చేస్తే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలన్న తలనొప్పితోపాటు, నారాయణను పీకేయాలన్న టెన్షన్‌ కూడా చంద్రబాబుకి తప్పదు. అందుకే, చంద్రబాబు వ్యూహాత్మకంగా మంత్రి వర్గ విస్తరణను పక్కన పెట్టేశారు. 

మొత్తమ్మీద, నారాయణ 'అండర్‌ కంట్రోల్‌'లోనే వున్నారన్నమాట. అలాగని, పూర్తిగా కాదండోయ్‌. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా (బినామీ అనే ఆరోపణలు కూడా వున్నాయండోయ్‌) నారాయణకి ఇంకా టీడీపీల ప్రాధాన్యత అలాగే వుందట. పైకి, నారాయణ చేసే హడావిడి మాత్రమే కాస్త కంట్రోల్‌లో వుంది. అదీ అసలు విషయం.

Show comments