హోంమంత్రి అలా.. ప్రధాని ఇలా.. ఎందుకిలా?

సర్జికల్ దాడుల వీడియోలను విడుదల చేస్తాం.. వెయిట్ చేయండి అంటూ చెప్పింది మరెవరో కాదు.. స్వయానా హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్! దాడులు జరగలేదు.. అంటూ పాక్ సైన్యం వాదిస్తున్న తరుణంలో, పాకిస్తాన్ మీడియాను పీవోకేలోకి తీసుకెళ్లి.. దాడులు జరగలేదు అని వాళ్లకు ఆ ప్రాంతాన్ని చూపిస్తున్న క్రమంలో రాజ్ నాథ్ ..ఆధారాలు చూపిస్తాం, వీడియోలు విడుదల చేస్తాం.. అని వ్యాఖ్యానించాడు!

హోంమంత్రి ఆ వ్యాఖ్యానాలు చేసిన కొన్ని గంటల తర్వాత ఆ వీడియోలను విడుదల చేయాలనడంపై ప్రధాని అసహనం వ్యక్తం చేశాడు! ఆధారాలు అడుగుతారా? అంటూ మోడీ విరుచుకుపడ్డాడట! మోడీ ఇలా అసహనం వ్యక్తం చేయగానే.. ఆధారాలు అన్న మాటెత్తిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించేశారు కొంతమంది! ఈ దేశంలో భక్తుడని అనిపించుకోవడమూ సులువే, దేశద్రోహి అనిపించుకోవడమూ సులవైపోయింది.

ఇక తాజాగా రక్షణ మంత్రి అయితే.. సర్జికల్ దాడుల వీడియోలను విడుదల చేయం.. అని స్పష్టం చేశాడు! మరి హోం మంత్రి ప్రకటనేమో అలా, ప్రధాని అసహనాన్ని పసిగట్టి రక్షణ మంత్రి ఇలా!

విడుదల చేస్తామని ఎందుకు ప్రకటించాలి? మళ్లీ అదే విషయంలో ఎందుకు అసహనం వ్యక్తం చేయాలి? అది కూడా  ప్రధాని, హోం మినిస్టర్ లు పరస్పర విరుద్ధంగా కొన్ని గంటల వ్యవధిలో వ్యక్తపరచాల్సిన భావాలేనా ఇవి? ఎందుకీ గందరగోళం!

ఇక ప్రభుత్వ వర్గాలే చెబుతున్న మరో మాట ఏమనగా.. సర్జికల్ దాడుల వీడియోలు విడుదల చేయడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి, పాక్ కు అసహనం కలగవచ్చు, దాడులకు పాల్పడవచ్చు.. అని వీరు వాదిస్తున్నారు! ఈ రకంగా వీరు తమ దేశ భక్తిని ప్రదర్శిస్తున్నారు. మరి పాక్ కు కోపం వస్తుంది కాబట్టి.. వీడియోలు విడుదల చేయం అని వాదించడం ఏ మేరకు సబబు? పాక్ కు కోపం వస్తుందని వీడియోలు విడుదల చేయరు సరే.. అలాంటప్పుడు  దాడులు ఎందుకు చేసినట్టు? దాడులు  చేసినప్పుడు పాక్ కు కోపం రాదనుకున్నారా?

వీడియోలు విడుదల చేస్తే.. ఉగ్రవాద మూకల స్థైర్యం కూడా దెబ్బతింటుంది కదా.. భారత్ సత్తా ఏమిటో వాళ్లకు తెలుస్తుంది కదా.. పాక్ కు కోపం వస్తుంది, షరీఫ్ బాధపడతాడు.. అనే వాదనలు ఏమిటో బొత్తిగా అర్థం కావడంలా!

Show comments