కేటీఆర్‌ నిజంగానే దత్తాత్రేయను పొగిడారా.?

'దత్తాత్రేయను విమర్శించేంత స్థాయి కాదు నాది..' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజమే, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ వయసులో కేటీఆర్‌ కన్నా చాలా పెద్ద. పైగా, దత్తాత్రేయ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా. వయసు పరంగా చూసుకున్నా, పదవి పరంగా చూసుకున్నా.. ఎలా చూసుకున్నా, దత్తాత్రేయను విమర్శించేంత స్థాయి కేటీఆర్‌ది కాదు. 

కానీ, రాజకీయాల్లో విమర్శించడానికి స్థాయి అవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరైనా ఎవర్నైనా ఎలాగైనా విమర్శించేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్నే తీసుకుంటే, చంద్రబాబు పదే పదే తన సీనియారిటీ గురించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కి గుర్తుచేస్తుంటారు. 'నన్ను సీనియర్‌గా గుర్తించు..' అంటూ చంద్రబాబు ప్రాధేయపడ్తున్న వైనాన్ని ఎలా మర్చిపోగలం.? రాజకీయాల్లోకి వస్తూనే, స్థాయిని మర్చిపోవాలి ప్రస్తుత రాజకీయాల్లో. ఇదో నిబంధనగా మారిపోయింది మరి.! 

వయసు తారతమ్యాల్ని పక్కన పెట్టి, కేటీఆర్‌ చాలా సందర్భాల్లో చాలామంది సీనియర్‌ పొలిటీషియన్లను విమర్శించేశారు. చంద్రబాబుని కేటీఆర్‌ ఎన్నిసార్లు విమర్శించారో లెక్కే లేదు. సోనియాగాంధీని సైతం కేటీఆర్‌ విమర్శించిన సందర్భాలున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు, ప్రధాని నరేంద్రమోడీనీ, ఆఖరికి.. బండారు దత్తాత్రేయని కూడా కేటీఆర్‌ విమర్శించిన సందర్భాలనేకం. అయితే, ఇప్పుడు విషయం వేరే.! 

అసలు విషయమేంటంటే, కేంద్రంతో సఖ్యంగా వుండాలనే నిర్ణయానికి టీఆర్‌ఎస్‌ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంతో పనిచేయడానికి సిద్ధంగా వుందనే సంకేతాలు కేటీఆర్‌, దత్తాత్రేయను కలిసిన సందర్భంలో ఇచ్చారు. ఐటిఐఆర్‌ విషయంలో కేంద్రం, తెలంగాణకు సహకరించడంలేదని విమర్శించిన ఇదే కేటీఆర్‌, ఇప్పుడు తప్పు కేంద్రానిది కాదు.. అధికారులదంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. 

కొసమెరుపు: దత్తాత్రేయపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలంటూ అచ్చం బీజేపీ నేతలా కేటీఆర్‌ వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కేటీఆర్‌, బీజేపీలోకి వెళ్ళిపోయారా.? దత్తాత్రేయ టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారా.? ఏంటీ మైత్రి.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కాని విషయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేస్తే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, సోదరి కవిత, ఈ మధ్యనే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏంటో, ఈ రాజకీయ మతలబు, ఎవరికీ అర్థం కాదంతే.

Show comments