డ్యామిట్‌.. 'ట్యూబ్‌లైట్‌' పగిలిపోయింది

సినిమాలన్నాక హిట్టూ ఫ్లాపూ సహజమే. కానీ, స్టార్‌ హీరోల సినిమాలపై ఎప్పటికప్పుడు అంచనాలు ఆకాశాన్నంటేస్తుంటాయి. అదీ స్టార్‌ పవర్‌ అంటే. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ మేనియా గురించి కొత్తగా చెప్పేదేముంది.?

సల్మాన్‌ఖాన్‌ సినిమా ఫ్లాపయినాసరే, నష్టాలొచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అన్న అభిప్రాయం బలంగా వుందక్కడ. ఈ మధ్యకాలంలో సల్మాన్‌ఖాన్‌ సినిమాలు సాధించిన సంచలన విజయాల నేపథ్యంలో, 'ట్యూబ్‌లైట్‌' సినిమాపై కనీ వినీ ఎరుగని స్థాయిలో అంచనాలేర్పడ్డాయి.

ప్చ్‌, 'ట్యూబ్‌లైట్‌' సరిగ్గా వెలగలేదు.. వెలగకపోవడం కాదు, బాక్సాఫీస్‌ వద్ద పేలిపోయింది. సల్మాన్‌ఖాన్‌ ఈ మధ్యకాలంలో ఇంత పేలవమైన సినిమా చేయలేదంటూ తొలి రోజే విమర్శలు పోటెత్తాయి. 'ఇంకా నయ్యం.. నేనె నెగెటివ్‌ మార్కులేస్తారనుకున్నాను.. కానీ, నా సినిమా వసూళ్ళే విమర్శలకు సమాధానమిస్తాయి..' అంటూ తొలి రోజు సినిమా ఫలితం తేలిపోయాక సల్మాన్‌ఖాన్‌ వెటకారంగా వ్యాఖ్యానించాడు.

కానీ, సల్మాన్‌ఖాన్‌ నమ్మకం వమ్మయిపోయింది. అస్సలేమాత్రం పుంజుకోలేకపోయింది 'ట్యూబ్‌లైట్‌'. ఈ మధ్యకాలంలో సల్మాన్‌ఖాన్‌ ఇంత డిజాస్టర్‌ చేయలేదు.. అని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు తేల్చేశారు. డిస్ట్రిబ్యూటర్లు దారుణమైన నష్టాల్ని చవిచూడాల్సిందేనని ఫిక్సయిపోయారు. సల్మాన్‌ఖాన్‌ తన అభిమానులకు ప్రతి యేడాదీ 'ఈద్‌' సందర్భంగా తన సినిమాని బహుమతిగా ఇస్తుంటాడు.. ఈసారీ ఇచ్చాడు.. కానీ, పగిలిపోయే ఫ్లాప్‌ ఇచ్చాడు. అంతే తేడా.

Show comments