పగవాడిక్కూడా రాకూడని పుత్రశోకమిది.!

క్రికెటర్‌ అజారుద్దీన్‌ తనయుడు.. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు.. సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ తనయుడు.. సినీ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు.. ఇంకా ఎందరో.! రోడ్డు ప్రమాదాలు పైన పేర్కొన్న ప్రముఖుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. చాలావరకు వీటిల్లో 'ఖరీదైన మరణాలే' వుంటాయి. కొన్ని సందర్భాలలో ఎంత ఖరీదైన వాహనం తమ వారసులకు ఆయా ప్రముఖులు అందిస్తారో, అంత దారుణమైన పుత్ర శోకం వారికి మిగులుతుండడం అత్యంత బాధాకరమైన విషయం. 

చాలాకాలం క్రితం అజారుద్దీన్‌ తనయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుర్రాడు కదా.. స్నేహితులతో కలిసి రేసింగుల్లో పాల్గొన్నాడు. ఫలితం, ప్రాణం పోయింది. అజారుద్దీన్‌ పుత్రశోకంతో విలవిల్లాడిపోయాడప్పుడు. బాబూమోహన్‌, కోట శ్రీనివాసరావు ఇద్దరూ తెరపై హిట్‌పెయిర్‌. ఈ ఇద్దరి జీవితాల్లోనూ ఒకే తరహా విషాదం.. అదీ వారి కుమారులు రోడ్డు ప్రమాదంలో మరణించడం ద్వారా చోటుచేసుకుంది. కుటుంబమంతా కలిసి కారులో వెళ్ళాల్సి వుండగా, తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన టూ వీలర్‌లో వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు కోట శ్రీనివాసరావు తనయుడు. ప్రమాదం ఖరీదైన టూ వీలర్‌ రూపంలో ఆయన ప్రాణాల్ని బలికొంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన కూడా అప్పట్లో అందర్నీ కలచివేసింది. 

కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి. కొన్ని ప్రమాదాలు మనం కోరి తెచ్చుకున్నవే. పైన చెప్పుకున్న చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యం, అతి వేగమే ఆయా వ్యక్తుల ప్రాణాల్ని తీసేశాయన్నది నిర్వివాదాంశం. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని హై ఎండ్‌ ఫీచర్లతో సరికొత్త కార్లు వస్తున్నా.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే వున్నాయి. ఈ తరహా ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను మిగుల్చుతాయి.

ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపడంతోపాటుగా, వ్యవస్థలోని లోపాల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సి వుంటుంది. ఖరీదైన వాహనాలతో 'హోదా, దర్పం' ప్రదర్శిస్తున్నామనీ, దాన్ని తమ వారసులు కొనసాగిస్తున్నామని మురిసిపోవడం వరకూ బాగానే వుంటుంది కానీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే, పుత్రశోకాన్ని కొనితెచ్చుకుంటున్న తల్లిదండ్రుల తీరునీ తప్పు పట్టాల్సి వస్తుంది. కోటిన్నర పైన విలువ చేసే వాహనం, మరణాన్ని మోసుకురావడమా.? ఎన్ని కోట్లు ఖర్చుపెడితే, పాతికేళ్ళ కొడుకు తిరిగొస్తాడు.?

Show comments