బంగారు తెలంగాణలో రోజుకు ఇద్దరు రైతుల బలి

మొన్నటి భారీ వర్షాలతో నిండిన చెరువుల పక్కన యువత సెల్ఫీలు దిగుతోంది అంటూ.. మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కరువు తీరా వర్షాలొచ్చాయని.. మరో రెండేళ్ల వరకూ నీటి కష్టాలుండవని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు.

తెలంగాణ అంత సస్యశ్యామలమేనని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ వేళా విశేషం… ఈ విధంగా అంతా బాగుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. 

ఆఖరికి పరిస్థితి ఎక్కడకు వచ్చిందంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా సాగుతున్న ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ పరిస్థితి బాగుంది.. అని బయట నుంచి చూసే తెలుగువాళ్లు అనుకునేంత వరకూ వచ్చింది. Readmore!

బాబు డాంభీకాలు, వృథా ఖర్చులు, ప్రచార దుగ్ధ తప్ప ఏపీ లో ఏమీ లేకపోవడంతో పాటు.. ఈ ఏడాది వరుణుడు కూడా తెలంగాణ మీదే కరుణ చూపించాడు, రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా ఎండబెట్టాడు. దీంతో ‘తెలంగాణ ఈజ్… సమ్ థింగ్..’ అనే వాళ్లు ఎక్కువయ్యారు.

మరి ఏపీలో రైతాంగ వ్యథలు అన్నీ ఇన్నీ కావు. ఆ సంగతలా ఉంటే.. తెలంగాణలో అసలు పరిస్థితి గురించి ఒక  అధ్యయన సంస్థ చెప్పిన విషయాలు  నిజంగా విస్మయాన్నే కలిగిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం బంగారు తెలంగాణలో ప్రతి రోజూ కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

గత రెండు నెలలుగా చెరువులు నిండు కుండలుగా మారాయని అంతా మురిసిపోతుంటే.. ఇదే సమయంలో అనగా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 134 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ స్వచ్ఛంద సంస్థ నివేదిక చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 2,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ సంస్థ చెబుతోంది.

కేవలం అధ్యయనం చేయడమే కాదు.. ఈ విషయాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికీ తెచ్చింది సదరు సంస్థ. ఆ నివేదిక స్వీకరించిన ప్రభుత్వం పరిశీలిస్తామని చెప్పిందట. ఈ అంశంపై మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలు నిజమే అయ్యుండొచ్చు కానీ గతంతో పోలిస్తే పరిస్థితిలో మార్పు వస్తోందని అంటున్నాడు.

ఎక్కడి మార్పు? ఇన్ని వేల మంది రైతులు రాలిపోతుంటే.. ఎక్కడ తెలంగాణ బంగారుమయం అయినట్టు? తెలంగాణ ఏర్పడితే అంతా మారిపోతుంది అన్నారుగా.. ఏం మార్పు తీసుకొచ్చారు? ఇప్పుడు నమోదవుతున్న రైతు ఆత్మహత్యలు అన్నీ గత పాలకుల పాపాలే.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు.. అనే వాదన వినిపించడాన్ని పక్కన పెట్టి.. కేసీఆర్ ప్రభుత్వం  ఈ పరిస్థితిని అర్థం చేసుకుని..తమ రైతులను కాపాడుకుంటే అదే చాలు. ప్రచారాలకు ప్రాధాన్యత తగ్గించి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో చిత్తశుద్ధిని, నిజాయితీ ని చూపుతుందని ఆశిద్దాం. 

Show comments

Related Stories :